బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటా పోటీగా నినాదాలు చేసుకోవడంతోపాటు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలపైనా లాఠీ చార్జి చేశారు. చెదర గొట్టారు.అంతేకాదు.. కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ.. పరిస్థితులు ఉద్రిక్తతంగానే కొనసాగుతున్నాయి.
ఏం జరిగింది?
మాజీ మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభ ఉప పక్షనాయకుడిగా కొనసాగుతున్నారు. ఈయనకు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో క్యాంపు కార్యాలయం ఉంది. ఇది అధికారిక బంగళా. దీనిని ప్రభుత్వమే కేటాయించిందని.. కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. అయితే.. నిన్న మొన్నటి వరకు లేని వివాదం సోమవారం తలెత్తింది. కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
అధికారిక బంగళా కాబట్టి.. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనిని బీఆర్ ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నారు. చివరకు విషయం పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పక్షాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. వారు శాంతించకపోవడంతో లాఠీ చార్జి చేశారు. అనంతరం.. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. కాగా.. దీనిపై అటు ప్రభుత్వం, ఇటు బీఆర్ ఎస్ కీలక నాయకులు ఎవరూ స్పందించలేదు.