2019- 2024 మధ్య కాలంలో ఏపీలో వైసీపీ తనదైన శైలి ఇష్టారాజ్య పాలనను సాగించింది. తాను తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రజాభిప్రాయం మేరకు చేపట్టని నాటి సీఎం జగన్… తనకు తట్టిందే చట్టం, నచ్చిందే న్యాయం అన్నట్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో తన సొంత జిల్లా కడప జిల్లాకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా తుంచేస్తూ తన తండ్రి పేరునే జిల్లా పేరుగా మార్చేశారు. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు… జగన్ సర్కారు ఏకపక్ష నిర్ణయాన్ని రద్దు చేసింది. కడప జిల్లా చారిత్రక ప్రాధాన్యాన్ని నిలబెడుతూ పూర్వపు పేరునే ఖరారు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
జగన్ కంటే కూడా ఆయన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో రెండో దఫా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెలల వ్యవధిలోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో వైఎస్ స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్య.. వైఎస్ సేవలకు గుర్తింపుగా ఆయన సొంత జిల్లా అయిన కడపకు డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణం చేశారు. నాడు ప్రథాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా అందుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వెరసి కడప జిల్లా కాస్తా డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లాగా మారిపోయింది. కడపకు డాక్టర్ వైఎస్సార్ పేరు జత అయ్యింది తప్పంచి… దాని చారిత్రక ప్రాధాన్యానికి ఎలాంటి భంగం కలగలేదు.
అయితే జగన్ ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే…చారిత్రక ప్రాధాన్యం, ప్రజల మనోభావాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా పేరులో నుంచి కడప అనే పదాన్ని ఏకంగా లేపేశారు. డాక్టర్ వైఎస్సార్ జిల్లాగా కడప జిల్లాను సంబోధించడం మొదలెట్టారు. దీనిపై జనం నుంచి భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా కూడా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా ఆయన సాగిపోయారు. ఇక విపక్షాల మాటను అయితే ఆయన కనీసం వినేందుకు కూడా సిద్ధపడలేదు. ఈ క్రమంలోనే విపక్ష నేత హోదాలో కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు… తాము అదికారంలోకి వస్తే జిల్లాకు పాత పేరునే పునరుద్ధరిస్తామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.
అనుకున్నట్లుగానే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవగా… టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విక్టరీ కొట్టింది. ఈ క్రమంలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగానే నెరవేరుస్తూ వస్తున్న చంద్రబాబు.. ఇటీవలి కేబినెట్ భేటీ కడప జిల్లాకు పూర్వపు పేరు డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి అనుగుణంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరును డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వెరసి జగన్ దూకుడు నిర్ణయాల్లో మరో నిర్ణయాన్ని చంద్రబాబు రద్దు చేసినట్టు అయ్యింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates