తెలంగాణను పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ.. ఉద్యమాన్ని రగిలించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ.. ఇప్పుడు సంక్షోభం దిశగా దాదాపు ప్రమాదపు టంచుల వరకు చేరిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. ఎవరికి వారు భీష్మించుకుని కూర్చున్న నేపథ్యంలో పార్టీ ముక్కలు చెక్కలు అవుతుందా? లేక.. టీ కప్పులో తుఫానుగా మారుతుందా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కుమార్తెగా, ఎమ్మెల్సీగా కవిత రాసిన లేఖ.. పరిస్థితి ఎలా ఉన్నా.. అనంతరం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. మాత్రం ఇది తెగే దాకా లాగుతున్నారన్న సంకేతాలను స్పష్టంగా కనిపించేలా చేస్తోంది.
మెట్టు దిగడం ఎవరి వంతు?
తాజాగా తాను రాసిన లేఖను కవిత సమర్ధించుకున్నారు. పార్టీలో ఉన్న పరిస్థితులను తాను చెప్పానని ఒప్పుకొన్న ఆమె.. ఈ లేఖను ఎవరు బయటకు లీక్ చేశారో తెలియదని అన్నారు. అయితే.. ఆది నుంచి కూడా.. ఇలాంటి ఎదురీతలకు.. కేసీఆర్ సుతరాము ఇష్ట పడరన్న విషయం పార్టీ పరిస్థితిని ఆది నుంచి గమనించిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంటే నడిచిన అనేక మంది.. తర్వాత.. కాలంలో కేసీఆర్‌కు సూచనలు చేయడాన్ని కూడా ఆయన సహించలేక పోయారు. ఈ క్రమంలోనే అనేక మందిని పక్కన పెట్టారు. అనేక మంది పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు.
ఇప్పుడు ఈ జాబితాలో కవిత చేరింది. ఆమె ఆయన కుమార్తే కావొచ్చు. కానీ, పార్టీ సుప్రీంగా.. ఆయనకు మెట్టు దిగడం అనేది చాలా వరకు లేదనే సంకేతాలు వస్తున్నాయి. లేఖ విషయంపై మీడియా ముందుకు కవిత వచ్చి కూడా మూడు రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోగా.. అసలు పట్టించుకోనట్టే వ్యవహరించారు. అంతేకాదు.. తన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ ను పిలిపించుకున్న కేసీఆర్.. కవిత విషయంపై మాత్రం మౌనంగానే ఉన్నారంటే.. దాని అర్థం ఏంటి? అనేది స్పష్టంగానే తెలుస్తోంది.
ఇంత బతుకు బతికి.. ఇప్పుడు తన కుమార్తె ముందు.. కేసీఆర్ తల ఒంచుతారా? చర్చలకు దిగుతారా? అంటే ఇప్పటి వరకు అయితే.. సమాధానం లేదు. ఇక, ఈ ఎపిసోడ్‌లో అంతర్గతంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవితను ప్రోత్సహించేవారు పెరుగుతున్నారు. బీఆర్ఎస్‌ను విచ్చిన్నం చేయాలని అనుకున్నవారు.. లేదా కేసీఆర్‌ను వ్యతిరేకించే వర్గం అంటూ.. ఒకటి ఎప్పుడూ కాచుకుని కూర్చుంది. ఈ వర్గం ఇప్పుడు చాపకింద నీరై.. కవితకు సలహాలు ఇస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇది మరింతగా కేసీఆర్‌కు రుచించడం లేదు. అందుకే మూడు రోజులు అయినా.. ఆమెను పిలవలేదు. కనీసం ఒక ప్రకటనను కూడా జారీ చేయలేదు.
ఇక, కవిత విషయానికి వస్తే.. మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకురాలిగా తనను నియమించాలని కోరుకున్న మాట వాస్తవం. కానీ.. ఇప్పటికే పార్టీలో రెండు నుంచి మూడు అధికార కేంద్రాలు పెరిగిపోయిన దరిమిలా.. ఇప్పుడు ఆ పనిచేసి మరింతగా చేతులుకాల్చుకునే పరిస్థితి లేక.. కవిత విన్నపాన్ని కేసీఆర్ నిష్కర్షగానే తోసిపుచ్చారు. మరోవైపు అన్నకు పట్టం కట్టేందుకు కేసీఆర్ సంసిద్ధులయ్యారన్న వార్తలు కూడా.. కవిత కుటుంబంలో చిచ్చు రేపుతున్నాయి. కారణాలు ఏవైనా.. ఇప్పుడు కేసీఆర్ మాత్రం తగ్గే పరిస్థితి లేదు. తనను దేవుడు అన్నా.. ఇతరులను దెయ్యాలన్నా.. ఆయన వీటిని రాజకీయ కోణంలోనే చూస్తారనేది విశ్లేషకుల మాట. సో.. ఇప్పుడు నెలకొన్న ఈ వివాదం ఎటైనా దారితీయొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఇక, వీరికి సర్ది చెప్పేవారు.. మధ్యవర్తిత్వం చేసేవారు కూడా లేక పోవడం మరో కీలక పరిణామం.