మిస్ ఇంగ్లండ్ ఆరోప‌ణ‌లు.. విచార‌ణ‌కు రేవంత్ ఆదేశం

హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న‌’మిస్ వ‌రల్డ్’ పోటీల్లో వివాదాస్ప‌ద తీరు క‌నిపిస్తోంద‌ని.. త‌న‌ను వేశ్య‌లా చూస్తున్నార‌ని పేర్కొంటూ.. బ్రిట‌న్‌కు చెందిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం రేపాయి. ఆమె ఆరోప‌ణ‌ల‌ను మిస్ వ‌రల్డ్ నిర్వాహ‌కులు కొట్టి పారేసినా.. జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాలో ప్ర‌ముఖంగా ఇవి హైలెట్ అయ్యాయి. పైగా.. రాష్ట్రంలోనూ ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నుంచి ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది మ‌హిళ‌ల ఆత్మాభిమానానికి సంబంధించిన విష‌య‌మ‌ని .. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మిస్ ఇంగ్లండ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ పై విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ విచార‌ణ క‌మిటీలో అంద‌రూ మ‌హిళా అధికారులే ఉండ‌నున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్‌, ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ సాయిశ్రీ తో కూడిన క‌మిటీని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తాజాగా ప్ర‌క‌టించారు. మాగీ చేసిన ఆరోప‌ణ‌లు.. మిస్ వ‌రల్డ్ పోటీలు జ‌రుగుతున్న తీరును వారు నిశితంగా విశ్లేషించి.. విచార‌ణ జ‌రిపి ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించ‌నున్నారు. ముఖ్యంగా వేశ్య‌లా చూస్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌ను స‌ర్కారు కూడా సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణించింది.

ఏయే విష‌యాల‌పై విచార‌ణ‌..

ప్ర‌భుత్వం నియ‌మించిన ఐపీఎస్‌ల క‌మిటీ.. ప్ర‌ధానంగా ఐదు అంశాల‌పై విచార‌ణ చేప‌ట్ట‌నుంది. 1) మాగీ వ‌చ్చినప్ప‌టి నుంచి ఆమె తిరిగిన ప్ర‌దేశాలు.. ఎవ‌రెవ‌రితో క‌లిసి ఆమె కంటెస్టులో పాల్గొన్నారు. 2) మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ వ్య‌వ‌హారం.. ఆయ‌న ఆదేశాలు స‌హా.. ఇత‌ర కంటెస్టెంట్ల వ్య‌వ‌హార శైలిని కూడా క‌మిటీ విచారించ‌నుంది. 3) మాగీ పాల్గొన్న డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు? అనే విష‌యంపైనా ఆరా తీయ‌నున్నారు. 4) పోటీల‌కు స్పాన్స‌ర్ చేసిన ధ‌న‌వంతులు ఎవ‌రు? 5) మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌, ఆత్మ‌గౌర‌వం కాపాడేందుకు తీసుకున్న చ‌ర్య‌లు ఏంటి? అనే ఐదు కోణాల్లోనూ ఈ మ‌హిళా ఐపీఎస్ అధికారుల క‌మిటీ విచార‌ణ జ‌ర‌పనుంది.