వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎవరు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేదిలేదన్నట్టుగా విచారణను ముమ్మరం చేస్తోంది. అయితే.. ఈ విషయం లో వైసీపీ అధినేత జగన్ ప్రబుత్వానికి సవాళ్లు రువ్వారు. రండి.. నేను విజయవాడలోనే ఉన్నాను. దమ్ముంటే అరెస్టు చేసుకోండి.. అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. ఇంత మంది అరెస్టు అవుతున్నా. జగన్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే.. ఒక స్కామ్‌లో ఒకరు అరెస్టు కావడం.. జైలుకు వెళ్లడం వరకు సరిపుచ్చితే బాగానే ఉంటుంది . కానీ ఈ లిక్కర్ కుంభకోణంలో మాత్రంవరుస పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి. పైగా అందరూ జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే.. ఆయన వద్ద పనిచేసిన వారే కావడం గమనార్హం. పోనీ.. జగన్‌తో సంబంధం లేకుండా.. దూరంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మరి ఇంత జరుగుతున్నా.. అంతధైర్యం ఎలా వచ్చిందన్నది ప్రశ్న.
దీనిపై పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ప్రకారం.. లిక్కర్‌లో లాజిక్కులు చూసి వైసీపీ ధైర్యంగా ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఐదు అంశాలపైనే జగన్ ఫోకస్ పెంచారని.. రేపు కోర్టుకు కూడా వీటిని వివరించనున్నారని చెబుతున్నారు. అందుకే అంత ధైర్యంగా ఉన్నారని చెబుతున్నారు. వీటి ఆధారంగానే ఈ కేసులు నిలబడవని ఆయన ధైర్యంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం..
1) వైసీపీ హయాంలో లిక్కర్ దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. కాబట్టి లంచాలు ఎవరికీ ఇచ్చే అవకాశం లేదు.
2) ధరలు నిర్ణయించింది కూడా.. ప్రభుత్వమే కాబట్టి.. దీనిలో తేడా చేసే అవకాశం లేదు. పైగా ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు.
3) లిక్కర్ ధరలు పెంచడంతో డిస్టిలరీల నుంచి నేరుగా తీసుకున్న మద్యానికి ఎవరు మాత్రం లంచాలు ఇస్తారు.? ధరలు తగ్గిస్తే.. లంచాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
4) ప్రముఖ బ్రాండ్లు ధరలు పెంచేందుకు ఇష్టపడకపోవడం వల్లే.. రాస్ట్రం నుంచి వెళ్లిపోయాయి.
5) డిజిటల్ పేమెంట్లు అప్పుడే విస్తరిస్తున్నాయి. కాబట్టి.. వాటిని పెట్టలేదు. కానీ, బాటిల్‌పై ఉన్న లేబుల్ మాత్రం కొనసాగింది.. కాబట్టి ఎన్ని బాటిల్లు అమ్మితే.. అంత సొమ్ము ఖజానాకు చేరుకుంది. దీని లెక్కలు పక్కాగానే ఉన్నాయి. కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని జగన్ విశ్వసిస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఆయన ధైర్యానికి ఇదే కారణమా? లేక ఇంకేమైనా ఉందా? అన్నది చూడాలి.