ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ తుఫాన్‌.. ఏం జ‌రుగుతుంది?

అగ్ర న‌టుడు, సినీ హీరో ప‌వ‌ర్ స్టార్‌.. తొలిసారి ఇనీ ఇండ‌స్ట్రీపై నిప్పులు చెరిగారు. అనూహ్య రీతిలో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఇదొక తుఫానేన‌ని చెప్పాలి. ఈ త‌ర‌హా ప‌రుషంగా క‌ఠినంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేసింది ఎప్పుడూలేదు. కానీ.. ఈ ద‌ఫా మాత్రం ఇండ‌స్ట్రీని క‌డిగేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని వారికి కృత‌జ్ఞ‌త అంటూ లేద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య చిన్న‌దేం కాదు. చాలా పెద్ద‌దిగానే చూడాలి. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అనేక వివాదాలు పెట్టుకున్నా.. ఈ త‌ర‌హాలో విరుచుకుప‌డిన సంద‌ర్భం.. విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భం కూడా లేదు.

కానీ.. ప‌వ‌న్ తాజాగా తుఫాను రేపారు. సినీ పెద్ద‌లు.. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా ఊహించ‌ని విధంగా ఏపీ డిప్యూటీ సీఎం నుంచి అధికారికంగా ఇలాంటి లేఖ వ‌స్తుంద‌ని కూడా.. ఎవ‌రూ అనుకోలేదు. ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ప్ర‌భుత్వాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదని.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు క‌నీసం గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారంటే.. మ‌న‌సులో చాలానే బాధ గూడుక‌ట్టుకుని ఉండాలి. అంతేకాదు.. ప‌రిశ్ర‌మ‌ను వైసీపీ ఎంతో అణిచేసినా.. ఇప్పుడు ప్ర‌భుత్వం అనేక స‌దుపాయాలు ఇస్తామ‌ని చెబుతున్నా.. అప్ప‌టి కంటే ఇప్పుడు బాగున్నా వారి నుంచి స్పంద‌న లేక‌పోవ‌డాన్ని ఆయ‌న నిప్ప‌ల‌తో క‌డిగేశారు.

సినీ ఇండ‌స్ట్రీపై ఈ త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేయ‌డం ఒక‌ర‌కంగా సాహ‌స‌మేన‌ని చెప్పాలి. ఇత‌ర నాయ‌కులు అయితే.. వేరే గా ఉండేది. కానీ.. సినీ ప‌రిశ్ర‌మ‌తో అనుబంధం ఉన్న నాయ‌కుడు, అగ్ర‌న‌టుడే ఇలా విరుచుకుప‌డితే.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. క‌ట్ట‌గ‌ట్టుకుని హీరోలు, నిర్మాత‌లు.. ద‌ర్శ‌క‌లు వ‌స్తారా? లేక‌.. ఏం చేస్తారు? ఏం చేసిన‌ప్ప‌టికీ.. ఒక్క‌సారి మాట అంటూ వ‌చ్చాక వెన‌క్కి తీసుకోవ‌డం అనేది సాధ్యం కాక‌పోవ‌చ్చు. కానీ.. ప‌వ‌న్ అంతరంగం గ‌మ‌నిస్తే.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విశాఖ‌లో సినీ ఇండ‌స్ట్రీని డెవ‌ల‌ప్ చేయాల‌ని భావిస్తోంది. కానీ.. అటు నుంచి స్పంద‌న లేదు. ఇక‌, సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు.. రాష్ట్రంలోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను తీర్చిదిద్దుతోంది..అయినా అటు నుంచి ఎవ‌రూ కిక్కురు మ‌న‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ఈ రేంజ్‌లో విరుచుకుప‌డ్డార‌న్న‌ది స‌త్యం.

మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?

సాధార‌ణంగా.. ఇలాంటి సంద‌ర్భం గ‌తంలో 1980ల‌లో త‌మిళ‌నాట క‌నిపించింది. అప్ప‌టి ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత ఇదే త‌ర‌హా లో సినీ ఇండ‌స్ట్రీపై విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు క‌నీసం ప‌వ‌న్ లేఖ ద్వారా స్పందించారు. అప్ప‌ట్లో అసెంబ్లీలోనే జ‌య‌ల‌లిత సినీ పెద్ద‌ల‌ను క‌డిగేశారు. మ‌న రాష్ట్రం గొడ్డుబోయిందా? ఇక్క‌డ ఎందుకు సినిమాలు తీయ‌రు? ఇక్క‌డ ప్ర‌బుత్వానికి ఎందుకు ట్యాక్సులు క‌ట్ట‌రు..? మీకురాష్ట్రంపై భ‌క్తిలేదు. రాష్ట్ర నుంచి ఆదాయంపై మాత్ర‌మే భ‌క్తి ఉంది అని క‌డిగేశారు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు చెన్నై కేంద్రంగా సినిమాలు తీసిన వారు.. త‌ర్వాత‌.. బెంగ‌ళూరు, హైద‌రాబాద్ కేంద్రం(త‌మిళ సినిమాలు)గా సినిమాలు తీశారు. ఆ త‌ర్వాత‌.. జ‌య‌ల‌లిత వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారి.. తిరిగి లైన్‌లోకి వ‌చ్చారు. ఇప్పుడు అదే జ‌రుగుతుందా? లేక‌.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.