రాజకీయాల్లో ప్రత్యర్థులకు షాకులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ.. ఊహించని విధంగా షాకులు ఇవ్వడమే ఇప్పుడు వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు కూడా.. ఇబ్బందిగా మారింది. “బాబా ఏముంది కేసులు పెడతాడు.. అంతేగా! పెట్టించుకోండి” అంటూ.. ఆరు మాసాల కిందట పార్టీ నాయకులకు జగన్ సూచించారు. ఆవెంటనే బెయిల్పై బయటకు కూడా వచ్చేయొచ్చని తేలిగ్గా చెప్పుకొచ్చారు. కానీ.. కేసులు పెడుతున్నా.. వాటి నుంచి తప్పించుకుని బయటకు వచ్చే అవకాశం లేకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారన్న విషయాన్ని జగన్ ఊహించలేదు.
అదేసమయంలో ఒకరు లేదా.. ఇద్దరు కీలక నాయకులపై కేసులు పెడతారని జగన్ ఊహించారు. కానీ, ఇప్పుడు అలా కాదు.. పక్కా ఆధారాలతోనే కేసులు పెడుతున్నారు. దీంతో కేసుల్లో ఇరుక్కుంటున్న వారు బయటకు రాలేకపోతున్నారు. వచ్చినా.. వేరే కేసుల్లో ఇరుక్కుని మళ్లీ జైలు బాట పడుతున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నుంచి రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వరకు.. అందరి పరిస్థితి ఇలానే ఉంది. దీనిని కూడా జగన్ ఊహించలేదు.
ఇక, తాజాగా రెండు విషయాల్లో చంద్రబాబు వేసిన పాచిక పారిందన్న చర్చ జరుగుతోంది. అదే.. కేంద్రం దగ్గర జగన్‌ను పలుచన చేయడం. ఏ జాతీయ మీడియానైతే..ఒకప్పుడు జగన్ నమ్మారో.. అదే జాతీయ మీడియా ముందు.. జగన్‌ను విధ్వంసకర నాయకుడిగా చంద్రబాబు ప్రొజెక్టు చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం ఏవిధంగా వెనక్కి పోయిందో సమగ్రంగా వివరించారు. తద్వారా.. జగన్‌కు ఉన్న కాస్త ఇమేజ్‌ను మట్టిలో కలిపేసే ప్రయత్నం చేశారు. ఇది కూడా.. జగన్ ఊహించని పరిణామమే.
అంతేకాదు.. అమరావతి రాజధానిని పార్లమెంటు వేదిగా గుర్తించేలా చంద్రబాబు చేసిన ప్రయత్నం మరో ఊహించని ఘటన. తాము వచ్చాక.. తమ సిద్ధాంతం తాము అమలు చేస్తామని.. వైసీపీ నాయకులు రాజధానిపై నర్మగర్భంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా.. చంద్రబాబు అష్టదిగ్భంధం చేసేలా రాజధానిని నోటిఫై చేయించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే జరిగితే.. రేపు జగన్ ప్రభుత్వమే వచ్చినా? మార్చలేని పరిస్థితి ఉంటుంది. ఇలా.. 11 మాసాల పాలనలోనే జగన్ కు ఊహించనివిధంగా చంద్రబాబు షాకులు ఇస్తున్నారన్నది వాస్తవం అంటున్నారు తమ్ముళ్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates