2014నాటి ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం’ ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో నిర్మించిన పలు భవనాల్లో ఏపీకి కూడా వాటాలు ఉన్నాయి. వీటిని చట్టంలోనే పేర్కొన్నారు. అయితే.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిపోయినా.. రాజకీయ పరమైన వివాదాల కారణంగా ఆయా ఆస్తుల పంపకాల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ.. నీటి వివాదాలు కొనసాగుతున్నట్టే.. ఆస్తుల వివాదాలు కూడా అలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలక ఆస్తి విషయంలో ముందడుగు పడింది.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్‌లో్ని ఎర్రమంజిల్‌లో ఉన్న పౌరసరఫరాలశాఖ భవన్‌లో తెలంగాణ, ఏపీ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఆస్తుల పంపకానికి సంబంధించి.. ఇరు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే అంశాలకు సంబంధించి భేటీ అయ్యారు. ఈ క్రమంలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఉమ్మడి ఏపీ పౌరసరఫరాల భవన్‌ను పూర్తిగా తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ తరఫున మంత్రి నాదెండ్ల అంగీకరించారు. అయితే.. దీనికి ప్రతిగా తెలంగాణ టెక్నాలజీ సాయం తమకు అందిస్తుందని ఆయన వెల్లడించారు.
వాస్తవానికి ఆస్తుల విభజన ప్రకారం.. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఉమ్మడి ఏపీ పౌరసరఫరాల భవన్‌లో సగం వాటా ఏపీకి చెందుతుంది. దీనిపై గతంలోనే ఏకాభిప్రాయానికి రావాలని ఇరు రాష్ట్రాలు ప్రయత్నించాయి. కానీ.. ముందడుగు పడలేదు. దీనిని తమకు ఇచ్చేయాలని కేసీఆర్ హయాంలోనే డిమాండ్ వినిపించింది. ‘ఎక్కడి ఆస్తులు అక్కడికే చెందుతాయి’ అని అప్పట్లో సీఎం కేసీఆర్ వాదన తెరమీదికి తెచ్చారు. దీనిపై ఏపీ అప్పట్లో ఒప్పుకోలేదు. ఇక, అప్పటి నుంచి వివాదంగానే ఉన్న ఈ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుని సదరు భవనాన్ని పూర్తిగా తెలంగాణకే అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు.
ఇక, ఇరు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణులకు కూడా శ్రీకారం చుట్టారు. ఏపీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం అందించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరలకే బియ్యాన్ని సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఇక, తెలంగాణ బియ్యాన్ని కాకినాడ పోర్టునుంచి రవాణా చేసుకునేందుకు ఏపీ అనుమతులు ఇస్తుంది. అదేవిధంగా రెండు రాష్ట్రాల రైతులకు ఉపయోగ పడేలా బియ్యం.. ఇతర పంటల విషయంలోనూ ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటాయి. ఈ మేరకు ఇరువురు మంత్రులు కూడా మీడియాకుపలు విషయాలు వెల్లడించారు.