ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని అమరావతి వ్యవహారంలో మరో కీలక ఘట్టం తెర మీదికి వచ్చింది. కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్ కూడా రాజధానికి వచ్చింది. రాజధాని విషయంలో గతంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఇటీవల కీలక నిర్ణయం తీసుకు న్నారు. ప్రస్తుతం రాజధానిని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే 33 వేల ఎకరాల భూములను రైతులనుంచి తీసుకున్నారు.
అయితే.. అంతర్జాతీయ విమానాశ్రయం సహా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మరో 44 వేల ఎకరాల భూములను తీసుకోవాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం రైతులతో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు.. రైతులలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే తమ రాజధాని పరిస్థితి ఏంటన్నది వారి ప్రశ్న. ఇటీవల ప్రధాని మోడీ సభకు ముందు రాజధాని రైతులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అక్కడి రైతులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని విషయంలో బలమైన తీర్మానం ఉండాలని.. దీనికి కేంద్రంతోనూ ఆమోద ముద్ర వేయించాలని వారు కోరారు. గతంలో వైసీపీ రాజధాని విషయంలో అనుసరించిన సూత్రాన్ని వారు ప్రస్తావించారు. రాజధానిపై పార్లమెంటులో చట్టం చేయిస్తే. ఎలాంటి ఇబ్బందీ ఉండదని కూడా రైతులు సూచించారు. దీంతో తాజాగా సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన చంద్రబాబు రాజధానిని ప్రత్యేక చట్టం ద్వారా ఏపీకి శాశ్వత రాజధాని, ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తించాలని కోరారు. దీనిపై సమగ్రంగా చంద్రబాబు ఆయనకు వివరించారు. దీంతో రియలైజ్ అయిన అమిత్ షా.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇదే జరిగితే.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ పార్లమెంటులో చట్టం చేస్తారు. తద్వారా ఇక, ఏ ప్రభుత్వం వచ్చినా.. మార్పు లేకుండా రాజధాని ఉంటుందనడంలో సందేహం లేదు.