బీఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన సంచలన లేఖ.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఇక, బీఆర్ ఎస్‌పై తీవ్ర చర్చకు కూడా దారితీసింది. దీనిపై కవిత శుక్రవారం రాత్రే స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేనన్నారు. అయితే.. కొందరు కోవర్టుల కారణంగానే అది బయటకు వచ్చి ఉంటుందన్న ఆమె.. కేసీఆర్‌ను దేవుడితో పోల్చారు. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ వ్యవహారంపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. లేఖ రాయడం తప్పు కాదన్న ఆయన.. అంతర్గత విషయాలను రోడ్డు పడేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా ఎప్పుడైనా లేఖలు రాసే అవకాశం ఉందన్నారు. దీనిని తాము తప్పుబట్టడం లేదని.. కానీ, కొన్ని అంతర్గత విషయాలపై అంతర్గతంగానే చర్చిస్తే బెటర్ అన్నది పార్టీ నియమావళి అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక, కోవర్టుల విషయంపై మాట్లాడుతూ.. అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు వారే బయటకు వస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అయితే..కవిత రాసిన లేఖను తాను రాజకీయ కోణం కన్నా.. సూచనలు సలహాల కోణంలోనే చూస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయడం ఎవరికీ భావ్యం కాదన్న ఆయన.. ఏదైనా ఉంటే కేసీఆర్ దగ్గర ఫ్రీగా చెప్పుకోవచ్చని సూచించారు. ఇక, పార్టీలైన్ కవిత దాటారా? అన్న మీడియా ప్రశ్నలకు ఆయన దాట వేశారు. ఆ విషయం పార్టీ అధినేత చూసుకుంటారని వ్యాఖ్యానించారు.