క‌విత.. మ‌రో ష‌ర్మిల‌గా మారుతున్నారా!

బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత.. వ్య‌వ‌హారం పై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌ సాగుతోంది. ఆమె గ‌త కొన్నాళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ప్ర‌స్తుతం త‌న తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ వంటివి.. రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుది పేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన కుటుంబ స‌భ్యులు లేరంటే లేరు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఇష్ట‌మైనా … అయిష్ట‌మైనా వాటిని కొన‌సాగించారు. వాటిని పాటించారు. దేశ‌వ్యాప్తంగా పొత్తులు పెట్టుకునేందుకు వెళ్లిన‌ప్పుడు పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశంలో కేసీఆర్‌ను ఆయ‌న త‌న‌యుడు, అప్ప‌టి మంత్రి కేటీఆర్‌ విభేదించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించారు. ఆ త‌ర్వాత‌.. కూడా కుటుంబంలో వివాదాలు విభేదాలు కామ‌న్‌గానే వెలుగు చూసినా.. ర‌చ్చ‌కు దారితీయ‌కుండా కుటుంబం జాగ్ర‌త్త ప‌డింది. కానీ, తాజాగా క‌విత నేరుగా త‌న తండ్రి ని ప్ర‌శ్నించ‌డం.. “మ‌నం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామ‌న్న సంకేతాలు పంపించ‌డం స‌రిగాదేమో!”, “కాంగ్రెస్ కంటే వెనుక బ‌డుతున్నాం.. “. “ఉద్య‌మ నాయ‌కుల‌కు గౌర‌వం త‌గ్గుతోంది.” “ప్లీన‌రీ స‌రిగా లేదు” అని వ్యాఖ్యానించ‌డం చూస్తే.. క‌విత నేరుగా వివాదానికి దిగుతున్న‌ట్టే క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలుచెబుతున్నాయి.

తాజాగా అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నాయ‌కులు కూడా క‌విత వ్య‌వ‌హారంపై స్పందించారు. కాంగ్రెస్ వ‌దిలిన బాణ‌మేన‌ని బీజేపీ ఆరోపిస్తే.. బీజేపీ వ‌దిలిన బాణ‌మేన‌ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. తాజాగా బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా కూడా ఉన్న క‌విత‌.. త‌న నిబ‌ద్ధ‌త‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్ర‌ద‌ర్శించుకునే అవ‌కాశం.. త‌న తండ్రితో నేరుగా మాట్లాడే అవ‌కాశం ఉన్నా.. ఇప్పుడు బ‌హిరంగ వేదిక‌గా ఇలా లేఖ‌ సంధించ‌డం ద్వారా మ‌రో ‘ష‌ర్మిల‌’ కానున్నారా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ఆస్తులు, ప‌ద‌వుల విష‌యంలో అన్న‌తో విభేదించి.. తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టుకున్న విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. దానినిముగించి ఏపీలో కాంగ్రెస్ చీఫ్‌గా ఉంటున్నారు. అయితే.. ఇంత విభేదాలు నిజంగానే క‌విత – కేసీఆర్ మ‌ధ్య ఉన్నాయా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఆస్తుల వ్య‌వ‌హారం అయినా.. అప్పుల వ్య‌వ‌హారం అయినా.. గ‌తంలోనే తేలిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, రాజ‌కీయంగా గ‌తంలో ఎంపీసీటు ఇచ్చారు.తాజాగా ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. రేపు పార్టీ బాధ్య‌త‌ల‌ను కేటీఆర్‌కు అప్ప‌గించే ఆలోచ‌న ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతున్న ద‌రిమిలా.. క‌విత ఇలా యూట‌ర్న్ తీసుకున్నార‌న్నది రాజ‌కీయ వ‌ర్గాల అభిప్రాయం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.