అత్యాధునిక రక్షణ వ్యవస్థలలో ఒకటైన ఎస్-400 ట్రయంఫ్, గగనతల భద్రతకు అగ్రశ్రేణి కవచంలా నిలుస్తోంది. ఇది 400 కిలోమీటర్ల దూరం వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధవిమానాలను గుర్తించి ధ్వంసం చేయగలదు. శత్రు రేడార్ జామింగ్ వ్యవస్థలను ఎదుర్కొని పనిచేసే సామర్థ్యం ఇందులో ఉంది. భారత వైమానిక దళం పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు ఎస్-400 వ్యవస్థలను మోహరించింది.
ఇక మిగిలిన రెండు యూనిట్ల డెలివరీపై భారత్ దృష్టి సారించింది. 2018లో రూ.35 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న భారత్-రష్యాల మధ్య ఇప్పటివరకు మూడు వ్యవస్థలు చేరాయి. కానీ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి మిగిలిన డెలివరీ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం 2026 లోగా భారత్‌కు అందించాల్సి ఉంది.
అయితే ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత ఎస్-400 వ్యవస్థలు పాకిస్తాన్ వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, డెలివరీని వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెల 27 నుంచి 29 వరకు మాస్కో పర్యటనకు వెళ్లనున్నారు.
మాస్కోలో జరిగే భద్రతా ప్రతినిధుల అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనాల్సిన దోవల్, అక్కడ రష్యా అధికారులతో ఎస్-400 వ్యవస్థల విషయంలో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. త్వరిత డెలివరీకి అవసరమైన సహకారం కోరే అవకాశం ఉంది. త్వరగా మిగతా రెండు యూనిట్లు భారత్‌కు చేరితే, సరిహద్దు రక్షణ మరింత గట్టిగా బలపడనుంది.