ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం లో రాష్ట్రం వడివడిగా అభివృద్ధి బాట పడుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే.. ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి ఒక్కరికి చేరువ కావడమేనని, దానినే నిజమైన అభివృద్ధి అంటారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ ఆదర్శాల మేరకుగ్రామ స్వరాజ్య
సాధనకు నిజమైన అంకిత భావంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ భారత్ మహోత్సవ్ పేరిట ప్రధాని మోడీ చేస్తున్న పనులు దేశంలో గ్రామీణులకు మేలు చేస్తున్నాయని కొనియాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ, ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఇప్పటి వరకుపలు కార్యక్రమాలు చేపట్టామ న్న పవన్ కల్యాణ్.. ఇవన్నీ.. గ్రామీణ ప్రజలకు ఉద్దేశించినవే కావడం గమనార్హమని పేర్కొన్నారు. గ్రామ సభ, పల్లె పండుగ, అడవి తల్లి బాట వంటివి చేపట్టడం ద్వారా గ్రామీణుల జీవితాల్లో సరికొత్త మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. తాజాగా చేపట్టిన మన ఊరు.. మాటా మంతి
కార్యక్రమం ద్వారా గ్రామీణులకు మరింత భరోసా కల్పించే ఘట్టాన్ని చేపట్టామన్నారు.
కాగా.. గురువారం పవన్ కల్యాణ్ మాటా-మంతి పేరుతో వెండితెర వేదికగా .. అనే క్యాప్షన్‌తో గ్రామీణులతో ఇంటరాక్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలోని రావి వలస గ్రామ ప్రజలతో ఓ సినిమా హాలులో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు. వారి నుంచి వినతులను కూడా స్వీకరించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం.