“తాను ఉన్నంతకాలం తత్వం బోధపడదు.. తత్వం బోధ పడ్డాక తానుండడు” అని ఒక కొటేషన్ ఉంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు ఇది అతికినట్లు సరిపోతుంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ ను, శ్రేణులను, కార్యకర్తలను, ఆఖరికి మెజారిటీ ఎమ్మెల్యేలను కూడా జగన్ విస్మరించారన్నది జగమెరిగిన, జగనెరిగిన సత్యం.
అందుకే, ఈ మధ్య పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో సమావేశమైన ప్రతి సారీ జగన్ ఒకే పాట పాడుతున్నారు. జగన్ 2.0 కార్యకర్తల కోసమే ఉంటుంది అంటూ తన తప్పును తానే పదే పదే చెప్పుకుంటున్నారు. అంటే, అధికారంలో ఉన్న సమయంలో అహంకారంతో కేడర్ ను నిర్లక్ష్యం చేశానని జగన్ చెప్పారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదని వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు.
కార్యకర్తలను పట్టించుకోలేదు అంటూ జగన్ స్వయంగా ఒప్పుకోవడంతో వైసీపీ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతింది. ఇటువంటి సమయంలో తాజాగా జగన్ పార్టీని నడిపేందుకు డబ్బుల్లేవంటూ చేతులెత్తేసిన వైనంతో మరోసారి కేడర్ నైతిక స్థైర్యం కుదేలైంది. తన దగ్గర పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవని, ఎవరైనా ఇస్తే తీసుకుంటా అని జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
“నా దగ్గర డబ్బుల్లేవు… కష్టాల్లో ఉన్నా…గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా…పార్టీ నడపడంలో ఆర్థిక ఇబ్బందులున్నాయి…మీ దగ్గర డబ్బులుంటే నాకు ఇవ్వండి…నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా…” అంటూ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీ నేతల లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఆ స్కామ్ డబ్బులు ఏమయ్యాయంటూ జాతీయ మీడియాకు చెందిన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ ఈ విధంగా సమాధానమిచ్చారు.
అసలు స్కామ్ జరగనప్పుడు డబ్బులు, ఆర్థిక అవకతవకలు ఎక్కడివి జగన్ ప్రశ్నించారు. తాను మాట్లాడుతోంది చంద్రబాబుకు సంబంధించిన డబ్బులని జగన్ అన్నారు. ఏది ఏమైనా…ఫ్లోలో పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవని జగన్ వ్యాఖ్యానించడంతో జగన్ మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates