ప్ర‌పంచానికి ముప్పే: ఇరాన్ వ‌ర్సెస్ అమెరికా.. మ‌ధ్య‌లో ర‌ష్యా!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా.. ప్ర‌పంచ దేశాలు ఇప్ప‌టికే చ‌మురు, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ఇర‌కాటంలో ప‌డ్డాయి. అనేక దేశాల్లో మార‌కం విలువ‌లు ప‌డిపోయాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్ర‌వ‌రి 28న ప్రారంభించిన యుద్ధం.. మ‌ధ్య‌లో కొంత విరామం తీసుకుని, చ‌ర్చ‌ల దిశ‌గా అడుగులు వేసినా.. ఆ చ‌ర్చ‌లు ఫ‌లించ‌డం లేదు. పైగా.. అటు ఇరాన్‌..ఇ టు అమెరికాలు ప‌ర‌స్ప‌రం హెచ్చ‌రిక‌లు చేసుకుంటున్నాయి. రేపో మాపో.. ఇరాన్‌ను అంతం చేస్తామంటూ.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. అమెరికాకు.. కాలుకు కాలు.. చేతికి చెయ్యి అన్న విధంగా స‌మాధానం చెబుతామ‌ని ఇరాన్ హెచ్చ‌రించింది. త‌మ వ‌ద్ద ఉన్న అధునాత‌న ఆయుధాల‌ను ప్ర‌యోగిస్తే.. అమెరికాకు గుండె పోటు వ‌స్తుంద‌ని కూడా తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మ‌రోవైపు.. కీల‌క‌మైన హోర్ముజ్ జ‌ల‌సంధిలో ఇంధ‌న ర‌వాణా నిలిచిపోయింది. దీంతో అనేక దేశాలు.. ఇంధ‌న స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. ఇదేస‌మ‌యంలో వేరే దేశాలు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచేశాయి.

మొత్తంగా ఈ ప‌రిణామాలు తీవ్ర‌రూపం దాలుస్తున్న స‌మ‌యంలో ఇప్పుడు తాజాగా మ‌రో దేశం ఎంట్రీ ఇచ్చింది. అమెరికాను తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించింది. అదే.. ర‌ష్యా. ఇరాన్‌పై ఈగ వాలినా.. ఇకపై తాము చూస్తూ ఊరుకునేది లేద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చేశారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యా ఇరాన్‌కు తెర‌చాటు సాయ‌మే చేసింద‌న్న వాద‌న ఉంది. కానీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయింది. దీంతో అమెరికా కూడా అంతే రీతిలో స్పందించే అవ‌కాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. ఇరాన్ – అమెరికాల మ‌ధ్య గోటితో పోయే వివాదం గోడ్డ‌లిదాకా వ‌చ్చింది. దీనిలో ఇరాన్ మిత్ర దేశాలు పార్టిసిపేట్ చేయ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌ల‌ను పెంచేసింది. ఇదిలావుంటే.. అమెరికాకు సాయం చేసేందుకు.. ఆ దేశ వాద‌న‌ను స‌మ‌ర్ధించేందుకు కీల‌క‌మైన నాటో దేశాలు స‌సేమిరా అంటున్నాయి.

ముందు హార్ముజ్ జ‌ల‌సంధిని తెరిచేలా చూడాల‌ని అమెరికాపై ఒత్తిడి చేస్తున్నాయి. అంటే.. ఇరాన్ ఇప్పుడు బ‌లోపేతం అవుతుండ‌గా.. అమెరికా ఒంటిరి అవుతోంది. ఈ ప‌రిణామంతో ట్రంప్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది చూడాలి.