=

విశాఖ న‌గ‌రంపై జ‌న‌సేన తొలి విజ‌యం!

గ్రేట‌ర్ విశాఖ ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో జ‌న‌సేన తొలిసారి విజ‌యం ద‌క్కించుకుంది. ఇటీవ‌ల వైసీపీ మేయ‌ర్‌ను గ‌ద్దెదించిన కూట‌మి నాయకులు.. ఈ కార్పొరేష‌న్‌లో జెండా ఎగురేశారు. ఈ నేప‌థ్యంలో కార్పొరేష‌న్ మేయ‌ర్‌ ప‌ద‌విని టీడీపీ ద‌క్కించుకోగా.. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. వాస్త‌వానికి సోమ‌వార‌మే దీనిని పూర్తి చేయాల్సి ఉన్నా.. సొంత పార్టీ నాయ‌కుల్లోనే విభేదాలు త‌లెత్తాయి. దీంతో కొంద‌రు కార్పొరేట‌ర్లు .. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు దూరంగా ఉండిపోయారు.

దీనికి కార‌ణం.. ఉప ముఖ్య‌మంత్రి, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. డిప్యూటీ మేయ‌ర్‌గా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని ఎంపిక చేయ‌డ‌మే. ముఖ్యంగా జ‌న‌సేన‌లో కొంద‌రు నాయ‌కులు ప‌వ‌న్ ఎంపిక‌ను త‌ప్పుబ‌ట్టారు. కానీ.. ప‌వ‌న్ మాత్రం ద‌ల్లి గోవింద రెడ్డికే మొగ్గు చూపారు. ఆయ‌న పేరునే డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వికి ఎంపిక చేసి సీల్డ్ క‌వ‌ర్‌లో పంపించారు. అయితే.. ముందుగానే ఈ పేరు బ‌య‌టకు తెలిసిపోవ‌డంతో కొంత మంది అలిగి సోమ‌వారం నిర్వ‌హించిన స‌మావేశానికి రాలేదు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జాము నుంచే పార్టీనాయ‌కుల‌తో మాట్లాడి.. వారిని లైన్‌లో పెట్టారు. ఫ‌లితంగా ద‌ల్లి గోవింద‌రెడ్డి ఎన్నిక సునాయాసంగా మారింది. దీంతో జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ పీఠాన్ని జ‌న‌సేన కైవసం చేసుకున్న‌ట్ట‌యింది. 64వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్‌ దల్లి గోవింద్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యులు ఆయ‌న‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.