ఏపీలో ఏడాది క్రితం ప్రభుత్వం మారిపోయింది. అప్పటిదాకా బలంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోగా… అప్పటిదాకా బొటాబోటీ సభ్యులున్న కూటమి రికార్డు విక్టరీ కొట్టి కాలర్ ఎగరేసిందనే చెప్పాలి. కూటమి సారథిగా ఉన్న టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా… కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత దాదాపుగా అన్ని స్థాయిల్లోనూ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇలాంటి క్రమంలో మంగళవారం అటు జనసేనకు ఫుల్ జోష్, వైసీపీకి ఓ మోస్తరు హుషారు తీసుకొచ్చే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి.
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో మొన్నటిదాకా వైసీపీ అధికార పార్టీగా కొనసాగగా… ఇటీవలే జరిగిన పరిణామాలతో ఆ అధికారం కూటమికి దక్కింది. టీడీపీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మేయర్ గా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్ గా పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం దక్కగా… జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీకి చెందిన గోవింద రెడ్డిని ఆ పదవికి ఎంపిక చేశారు. అయితే కూటమి పార్టీల మద్య అవగాహన లేమితో సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడగా…మంగళవారం మాత్రం ఏకగ్రీవంగానే గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డిని అభినందిస్తూ పవన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఇదిలా ఉంటే..జీవీఎంసీకి చెందిన ఓ టీడీపీ కార్పొరేటర్ మంగళవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. మంగళవారం తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కాగా…పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ సౌత్ నియోజకవర్గ ఇంచార్జీ వాసుపల్లి గణేశ్ లతో కలిసి వచ్చిన 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. పూర్ణిమకు స్వయంగా జగనే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెరసి మంగళవారం జీవీఎంసీలో జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కగా.. గుడ్డిలో మెల్ల మాదిరిగా టీడీపీకి చెందిన ఓ కార్పొరేటర్ చేరడంతో వైసీపీ కూడా ఒకింత సంబరపడింది.