ప‌వ‌న్ ఎలా ఉన్నా.. బాబుపై మాత్రం మామూలుగా లేదుగా…!

ప్ర‌భుత్వంలో ఉన్న నాయ‌కుల‌పై ఒత్తిడి స‌హ‌జం. త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని ప్ర‌జ‌లు .. త‌మ కోరిక‌లు తీర్చాల‌ని నాయ‌కులు.. కోరుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఎప్పుడు అమ‌లు చేస్తారా? అని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. ఇదేస‌మ‌యంలో త‌మకు ఎప్పుడు న్యాయం చేస్తారా? అని నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు అంశాలు ఏ ప్ర‌భుత్వం ఉన్నా.. కామ‌నే.

అయితే.. సాధ్య‌మైనంత వ‌రకు ఈ రెండు విష‌యాల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వంలో ఉన్న పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. అయితే.. ఈ విష‌యంలో చంద్ర‌బాబుపై ఉన్న ఒత్తిడి.. డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్‌పై లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సూప‌ర్ సిక్స్ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప‌ద‌వుల విష‌యంలో చంద్ర‌బాబు చుట్టూ.. ఇప్ప‌టికీ.. త‌మ్ముళ్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూనే ఉన్నారు. నిజానికి 100కు పైగా ప‌ద‌వులు పంచినా.. టీడీపీలో సీనియ‌ర్లు ఇంకా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు.

దీంతో వీరంతా త‌మ‌కు బాబు ఎప్పుడు న్యాయం చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు. దీంతో మెజారిటీ నియోజక‌వ‌ర్గాల్లో ఇదే చ‌ర్చ సాగుతోంది. ఏ ఇద్ద‌రు సీనియ‌ర్లు క‌లుసుకున్నా.. ప‌ద‌వుల వ్య‌వ‌హార‌మే చ‌ర్చ‌కు వ‌స్తోంది. కానీ.. ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఇవ్వాల‌ని అనుకున్న ప‌ద‌వుల‌ను అంద‌రికీ దాదాపు ఇచ్చేశారు. ఇక‌, వ‌చ్చేవాటిలో ప‌ద‌వులు ఎలానూ వ‌స్తాయి కాబ‌ట్టి.. కీల‌క నాయ‌కులు దాదాపు కొలిక్కి వ‌చ్చేశారు కాబ‌ట్టి.. ప‌వ‌న్ భేఫిక‌ర్‌గా ఉన్నారు.

కానీ, చంద్ర‌బాబు ప‌రిస్తితి అలా లేదు. ఇక‌, మ‌రో కీల‌క విష‌యంలోనూ.. బాబు ఇబ్బందులు ప‌డుతున్నా రు. వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబును జైల్లో పెట్టి, నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా ఇబ్బందులు పెట్టిన జ‌గ‌న్ ప‌రిస్థితిని వారు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్ల‌డంతో కొంద‌రు శాంతించారు.

కొడాలి నానిపై క‌సి ఉన్నా.. ఆయ‌న అనారోగ్యం నేపథ్యంలో ఈ విష‌యం చ‌ర్చ‌కు రావ‌డం లేదు. అయితే.. జ‌గ‌న్ విష‌యాన్ని మాత్రం త‌మ్ముళ్లు వ‌దిలి పెట్ట‌డం లేదు. దీంతో ఆయ‌న‌ను ఎప్పుడు జైలుకు పంపిస్తారంటూ.. టీవీ డిబేట్ల‌లో చ‌ర్చిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం కూడా బాబుపై ఒత్తిడి పెంచుతుండ‌డం గ‌మ‌నార్హం.