కూట‌మి పాల‌నకు ఎన్ని మార్కులు వచ్చాయంటే

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఓట్లు.. 60.02 శాతం. ఈ లెక్క కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే చెప్పింది. ఇటీవ‌ల త‌ర‌చుగా సీఎం చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. అయితే.. 11 మాసాల త‌ర్వాత కూడా.. ఇది అలానే ఉందా? ఏమైనా మార్పు క‌నిపించిందా? అంటే.. మార్పులేద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వివిధ వ‌ర్గాల నుంచి రాబ‌ట్టిన స‌మాచారం బ‌ట్టి.. కూట‌మికి ప్ర‌జ‌లు వేసిన మార్కులు 60 శాతంగానే ఉన్నాయ‌ని తెలిసింది.

దీనిని బ‌ట్టి.. కూట‌మి పాల‌న‌కు ఫ‌స్ట్ క్లాస్ ద‌క్కింద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. అయితే.. అస‌లు విష యం ఏంటంటే.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ఓటు బ్యాంకు కేవ‌లం 15 -20 శాతం మాత్ర‌మే. అంటే.. వంద మంది ఓట‌ర్ల‌లో 15-20 మంది మాత్ర‌మే స‌ర్కారును ఉంచాలా? తుంచాలా? అనేది నిర్ణ‌యిస్తు న్నారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఓడించింది కేవ‌లం 2 శాతం మంది ఓట‌ర్లు మాత్ర‌మే. 2019లో టీడీపీని ఓడించింది.. 20 శాతం మంది ఓటర్లు.

ఇక‌, 2024 ఎన్నిక‌ల్లో టీడీపీకి 60.02 శాతం ఓట్లు రాగా.. వైసీపీకి 39.8 శాతం ఓట్లు వ‌చ్చాయి. అంటే.. వీటి తేడా.. సుమారు 20 శాతం. కాబ‌ట్టి.. ఇప్పుడు ఈ 60 శాతం సంతృప్తిలో ఓటు బ్యాంకును మార్చ‌గ‌ల వారు 15-20 శాతం మంది అలానే ఉన్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో వీరిలో 10 శాతం మంది వైసీపీ సానుభూతి ప‌రులుగా ఉన్నారు. వీరు ఆశిస్తున్న‌ది.. సూప‌ర్ సిక్స్‌లో కొత్త‌గా ఇచ్చిన హామీల అమ‌లు కాదు.. గ‌తంలో జ‌గ‌న్ అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను ఇప్పుడు కొన‌సాగించాల‌నే.

వీటిలో అమ్మ‌వొడి(ప్ర‌స్తుతం త‌ల్లికి వంద‌నం), రైతు భ‌రోసా(ప్ర‌స్తుతం అన్న‌దాత సుఖీభ‌వ‌) వంటివి. కానీ, స‌ర్కారు వీటిని అమ‌లు చేసేందుకు మీన మేషాలు లెక్కిస్తోంది. మేలోనే అన్న‌దాత ఇస్తామ‌ని చెప్పినా.. ఇప్ప‌టికి 20వ తారీకు వ‌చ్చినా.. దుక్కులు దున్ని రైతులు రెడీ అయినా.. ఫ‌లితం లేదు. ఇక, త‌ల్లికి వంద‌నం జూన్‌లో ఇస్తామ‌ని చెబుతున్నా.. మాట‌కే ప‌రిమితం అవుతున్నారు.ఇ వి ప్ర‌ధాన అసంతృప్తు లుగా క‌నిపిస్తున్నాయి. తాజా స‌ర్వేలోనూ తేలాయి. సో.. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ క్లాస్ మార్కులు ప‌డిన‌ప్ప‌టికీ.. ఆ 10 శాతం ఓటు బ్యాంకు యూట‌ర్న్ కాకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.