తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి కావటం.. ఓట్ల లెక్కింపు.. పోటాపోటీ పరిణామాల వేళ.. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ తరచూ మీడియాతో మాట్లాడితే.. అందుకు భిన్నంగా డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మాత్రం సంయమనం పాటించారు. ట్రంప్ ఎంత కవ్వించినా.. ఆయన స్పందించలేదు. తొందరపడి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తనకు అవసరమైన ఆరు ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు చేతికి వచ్చేయటం దాదాపు ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా రావటం.. అందుకు తగ్గట్లే చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బైడెన్ పెదవి విప్పారు.

ఆయన ఏం మాట్లాడతారు? అన్న ఆసక్తి అమెరికన్లలో వ్యక్తం కావటమే కాదు.. ఆయన మాట కోసం ఎంతో ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటివేళ.. మీడియా ముందుకు వచ్చిన ఆయన.. గెలుపు ప్రకటనను చెసేశారు. ట్రంప్ పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నట్లుగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలుస్తున్నట్లుగా చెప్పిన బైడెన్.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టటం ఖాయమన్న సంకేతాలు వస్తున్న వేళ.. తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు.

తన ప్రసంగంలో అనవసరమైన తొందరపాటును ప్రదర్శించని బైడెన్.. ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ గెలిచినట్లుగా ఇప్పుడే ప్రకటించటం లేదని చెప్పటం ద్వారా.. ట్రంప్ కు చురకలు వేసినట్లుగా చెప్పాలి. ఊరికి ముందే.. తాము గెలుస్తున్నట్లుగా ట్రంప్ చెబితే.. ప్రజాభిప్రాయాన్ని చట్టబద్ధంగా ప్రకటించిన తర్వాత మాత్రమే తాను ప్రకటిస్తానన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.

24 గంటల క్రితం జార్జియాలో తాము వెనుకంజలో ఉండగా.. ప్రస్తుతం తాము అధిక్యంలో ఉన్నామని.. 24 ఏళ్ల తర్వాత అరిజోనాలో.. 28 ఏళ్ల తర్వాత జార్జియాలో తాము గెలవనున్నట్లుగా చెప్పారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిచిన చాలా రాష్ట్రాల్లో ఈసారి తాము గెలుస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధిస్తున్నట్లు చెప్పిన బైడెన్.. ట్రంప్ పై 40 లక్షల ఓట్ల మెజార్టీతో తాము గెలుస్తామని.. 300లకు పైగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించబోతున్నట్లు చెప్పారు.

ప్రాంతాలు.. మతాలకు అతీతంగా రికార్డు స్థాయిలో అమెరికన్లు మార్పును కోరుకుంటున్నట్లు చెప్పిన బైడెన్.. తన మొదటి సంతకం కోవిడ్ కార్యాచరణ మీద ఉంటుందన్నారు. కరోనా నివారణ.. విద్వేషాన్ని అరికట్టేందుకు అనేక ప్రణాళికల్ని తయారుచేశామన్నారు. వాటిని ప్రజలకు చేరువయ్యేలా చేశామన్నారు. కఠినమైన ఎన్నికల వేళ.. ఉద్రిక్తతలు.. ఆందోళనలు ఉంటాయని తెలుసని.. అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరిన బైడెన్.. అందరి ఓట్లను తప్పనిసరిగా లెక్కిస్తారన్నారు. రాజకీయాల్లో మనం ప్రత్యర్థులం కావొచ్చు కానీ.. శత్రువులం మాత్రం కామని.. అందరం అమెరికన్లమే అంటూ.. రిపబ్లికన్ల మనసుల్ని దోచేలా తన తొలి ప్రసంగంలో బైడెన్ వ్యాఖ్యానించటం గమనార్హం.