జనావాసాల్లో నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గంతలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే సమయంలో పొలాలను నిత్యం నీటితో కళకళలాడేలా చేయడంలో పంట కుంటలు ఇతోధికంగా తోడ్పాటు అందిస్తాయి. పేర్లు వేరైనా… వీటి లక్ష్యాలు ఒక్కటే. వీటిలో ఇంకుడు గుంతలను చాలా కాలం క్రితమే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తే..తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంట కుంటలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పంట కుంటలు ఇప్పుడు నిండా నీటితో కళకళలాడుతూ పవన్ ఆలోచనా తీరుకు అద్దం పడుతున్నాయి.
ఇటీవలే నంద్యాల జిల్లా పరిధిలోని కొణిదెల గ్రామంలో పవన్ పంట కుంటల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పంట కుంటల కార్యక్రమం ప్రారంభం కాగా… ఎక్కడికక్కడ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో పంట కుంటల తవ్వకాలు ఓ ఉద్యమంలా సాగాయి. ఎక్కడికక్కడ ప్రభుత్వ సహకారంతో పొలాల్లో పంట కుంటలు సిద్ధం అయ్యాయి. ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో పలు దఫాలుగా వర్షం కురిసింది. ఈ వర్షపు చినుకుల కారణంగా ఈ పంట కుంటలన్నీ నిండా నీటితో అలరారుతున్నాయి. పొలం మధ్యలో.. లేదంటే పొలంలో పల్లం ఎక్కడుంటే అక్కడ ఏర్పాటు అయిన ఈ పంట కుంటలు ఆ పొలానికి నీటి కొరతను తీర్చేసే దిశగా కనిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ ప్రారంభించిన పంట కుంటల పురోగతి ప్రస్తుతం ఎలా ఉందన్న విషయాన్ని పవన్ నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కార్యాలయం గురువారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో పంట కుంటల తవ్వకం సందర్భంగా వేసిన మార్కింగ్, అప్పుడప్పుడే మొదలైన తవ్వకాలను తొలి ఫొటోలో చూపించిన ఆ శాఖ… రెండో ఫొటోలో మాత్రం నిండా నీటితో కళకళలాడుతున్న పంట కుంటను చూపెట్టింది. మధ్యలోని కుంటలో నిండా నీరు ఉండగా…కుంట చుట్టూ పడిన వర్షపు చినుకులు వృథాగా పోకుండా…అక్కడికక్కడే ఇంకిపోయేలా చేసిన ఏర్పాట్లు కూడా ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా పవన్ ఆశయం సిద్ధించినట్టేనని ఈ శాఖ ప్రకటన తేల్చి చెప్పేసింది.