‘ఆ అక్కకు మనం ఏం అన్యాయం చేశాం. ఇలా ఎందుకు చేసింది? అసలు ఏం జరిగింది?’ ఇదీ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవికి, వైసీపీకి కూడా రాజీనామా చేసిన జకియా ఖానుం గురించి తీసిన ఆరా. ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న జగన్.. పార్టీ నాయకులకు ముఖ్యంగా కడప జిల్లా నాయకులకు ఫోన్ చేసిన ఆరా తీసినట్టు తెలిసింది. అక్కకు ఏం అన్యాయం చేశామని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. అసలు రాయచోటిలో ఏం జరిగిందో కూడా ఆరా తీశారు.
కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానుంకు జగన్.. ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ చైర్ పర్సన్ కూడా చేశారు. అయితే.. ఆమె పార్టీ అధికారం కోల్పోయిన దరిమిలా.. దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆమె బీజేపీ పంచన చేరారు. అయితే.. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న జగన్.. తాజాగా ఆమె గురించిన వివరాలు తెలుసుకున్నారు. అయితే.. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటన్నది ప్రశ్న.
ఇక, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి, జకియా ఖానుం కు మధ్య పార్టీలో విభేదాలు తలెత్తాయి. దీనిపై తాడేపల్లి వరకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే.. ప్రొటోకాల్ ప్రకారం.. తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని జకియా అలిగారు. తర్వాత.. తిరుమల లడ్డూలను, దర్శనాల టికెట్లను కూడా జకియా అనుచరులు బ్లాక్‌లో విక్రయించారన్న ప్రచారం జరిగింది. అయితే.. దీనివెనుక గడికోట అనుచరులు ఉన్నారని ఆమె ఆరోపించారు.
ఇవన్నీ.. కూడా ఎన్నికలకు ముందే జరిగాయి. అయితే.. అప్పట్లో బిజీగా ఉన్నానని అనుకున్నారో.. నిజంగానే జగన్‌కు తెలియదో చెప్పలేం కానీ.. అప్పట్లో అయితే ఆయన ఈ వివాదాన్ని లైట్ తీసుకున్నారు. పైగా గడికోటకు ఎక్కువగానే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, సహజంగానే పార్టీ అధికారం పోయిన తర్వాత.. జకియా మార్పు దిశగా అడుగులు వేశారు. ఈ విషయం తెలిసి కూడా గడికోట ఎక్కడా స్పందించలేదు. అసలు.. జకియా గురించిన చర్చ కూడా పెద్దగా చేయలేదు. ఈ పరిణామాలే ఆమెను పార్టీకి దూరం చేశాయన్న వాదన ఉంది. కానీ, ఇప్పుడు జగన్ ఆరా తీయడం గమనార్హం.