-->

బాబు ‘వెల్ఫేర్’తో జగన్ బలాదూరే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో పార్టీ పొలిట్ బ్యరో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాలను పార్టీ సీనియర్ నేత, ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా అచ్చెన్న ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. కూటమి సర్కారు అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు సంబంధించిన కేలండర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. అంటే… జాబ్ కేలండర్ తరహాలో వెల్ఫేర్ కేలండర్ అన్నమాట.

ఏ పార్టీ ప్రభుత్వమైనా తాము చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ఓ పక్కా ప్రణాళికతో కూడిన టైం టేబుల్ ను ప్రకటించి.. దానిని పకడ్బందీగా అమలు చేసుకుంటూ వెళితే… ఇక ఆ పార్టీ ప్రభుత్వానికి తిరుగు ఉండదనే చెప్పాలి. ఈ మాట చాలా పార్టీల విషయంలో రూడీ అయ్యింది కూడా. అదే రితిలో మాట తప్పను, మడమ తిప్పను అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అదినేత జగన్… జాబ్ కేలండర్ అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తన ఐదేళ్ల పాలనలో జాబ్ కేలండర్ ను ఆయన కనీసం విడుదల కూడా చేయలేకపోయారు. ఇక విడుదల చేయని కేలండర్ కు సంబంధించి అమలు గురించి ఆలోచించడం దుర్లభమే కదా.

తాజాగా చంద్రబాబు కూటమి సర్కారు సంక్షేమ పథకాలకు సంబంధించిన కేలండర్ ను విడుదల చేయనున్నట్లుగా నిర్ణయించడం పట్ల ఆసక్తి రేకెత్తుతోంది. వెల్ఫేర్ కేలండర్ విడుదల చేయడం సవాల్ తో కూడుకున్న విషయమే. ఎందుకంటే… ఒక్కసారి ఈ కేలండర్ రూపొందితే ఏటా అది పక్కాగా అమలు అయ్యి తీరాల్సిందే. లేదంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. అంటే… ఏంతో దూరదృష్టి ఉంటే తప్పించి ఈ వెల్ఫేర్ కేలండర్ రూపకల్పన సాధ్యం కాదన్న మాట. అయితే ఒక్కసారి ఈ కేలండర్ రూపొందితే.. ఆ తర్వాత దానిని అమలు చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఆ పార్టీ ప్రభుత్వానికి ఇక ఢోకా ఉండదనే చెప్పాలి.

చంద్రబాబు కూడా ఈ దిశగానే ఆలోచన చేసినట్టు ఉన్నారు. ఎందుకంటే.. ఏటా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసి తీరక తప్పదు. అలాంటి నేపథ్యంలో ఆ పథకాలకు సంబంధించిన కేలండర్ ను విడుదల చేసి అమలు చేసుకుంటూ పోతే సరిపోతుంది కదా అని ఆయన భావించినట్టున్నారు. ఈ విధానంతో తన ప్రభుత్వంపై ప్రజల్లో మంచి మైలేజీ కూడా దక్కుతుందని కూడా ఆయన అంచనా వేశారు. ఇప్పటికే అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు ఆ తర్వాత అమలులోకి వచ్చే పథకాలను జోడించుకుంటూ పోతే సరి. ఈ లెక్కన జాబ్ కేలండర్ అంటూ ఊదరగొట్టిన జగన్ ను వెల్ఫేర్ కేలండర్ తో చంద్రబాబు బెదరగొట్టేయడం ఖాయమేనన్న మాట.