ఎమ్మార్వో 10 ల‌క్ష‌లు తీసుకుంది.. అందుకే తిట్టా: ఎమ్మెల్యే

ఏపీలోని పార్వ‌తీపురం ఎమ్మెల్యే బోనేల విజ‌య‌చంద్ర‌.. ఇక్క‌డి ఎమ్మార్వో(త‌హ‌సీల్దార్‌)కు వివాదం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యే త‌న‌ను బూతులు తిట్టాడ‌ని పేర్కొంటూ.. త‌హ‌సీల్దార్ జ‌య‌ల‌క్ష్మి నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌కు వాట్సాప్ కాల్ చేసి.. బండ బూతులు తిట్టాడ‌ని.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. అయితే.. ఇలా ఎందుకు తిట్టాల్సి వ‌చ్చింది? అస‌లు తెర‌వెనుక ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని మాత్రం ఎమ్మార్వో చెప్ప‌లేదు.

ఇక‌, శ‌నివారం ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన ఎమ్మెల్యే విజ‌య‌చంద్ర‌.. విష‌యం చెప్పుకొచ్చారు. రైతుల నుంచి ఎమ్మార్వో లంచాలు తీసుకున్నార‌ని.. ఇద్ద‌రే రైతుల నుంచి 10 ల‌క్ష‌ల చొప్పున డిమాండ్ చేశార‌ని తెలిపారు. అయితే.. ఇంత పెద్ద మొత్తం లంచాలు తీసుకుని కూడా ఆమె ప‌నులు చేయ‌కుండా రైతుల‌ను వేధిస్తున్నార‌న్నారు. దీనికి సంబంధించి రైతులు త‌న‌కు ఫిర్యాదు చేశార‌ని, అందుకే ఎమ్మార్వో కు పోన్ చేసి మంద‌లించాన‌న్నారు. ఈ క్ర‌మంలో తిట్టిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

అంతేకాదు.. అస‌లు ఎమ్మార్వోకు మ‌తిస్థిమితం లేద‌ని, ఆమెను త‌క్ష‌ణం విశాఖ‌ప‌ట్నం ఆసుప‌త్రిలో చే ర్పించాల‌ని .. ఉద్యోగం నుంచి తీసేయాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలావుంటే.. ఎమ్మార్వో వ‌ర్సెస్ ఎమ్మెల్యే వివాదంపై ప‌రిష్కారం చూపించాల‌ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయ‌కులు ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో జిల్లా మంత్రి గుమ్మిడి సుధారాణి ఈ విష‌యాన్ని ప‌రిశీలించేలా సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. కాగా.. ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నార‌ని జ‌య‌ల‌క్ష్మి ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. మండ‌ల‌స్థాయి అధికారి లంచాలు తీసుకుంటున్న‌ట్టు ఆరోపిస్తున్న ఎమ్మెల్యే… అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న నేప‌థ్యంలో ఎక్క‌డా రూపాయి కూడా తీసుకోకుండా ప‌నులు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ, స్వ‌యంగా ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నార‌ని.. ఎమ్మార్వో, కాదు ఎమ్వార్వోనే లంచావ‌తారం గా మారార‌ని ఎమ్మెల్యే ప‌ర‌స్ప‌రం ఆరోపించుకోవడం ప్ర‌భుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది.