‘నాన్ లోకల్’ రద్దు… సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మొన్నటిదాకా కొనసాగిన నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లోని సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు 15 శాతం సీట్లను నాన్ లోకల్ కోటాకు కేటాయిస్తూ వస్తున్న విధానానికి ఏపీ సర్కారు చరమ గీతం పాడేసింది. ఇప్పటిదాకా 85 శాతం సీట్లతోనే సరిపెట్టుకుంటున్న ఏపీ విద్యార్థులు ఇకపై వంద శాతం సీట్లను పొందే అవకాశాన్ని చేజిక్కించుకుంటారు.

తెలుగు నేల విభజన తర్వాత హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన ఏపీ పునర్విభజన విభజన చట్టం… అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలోని విద్యా సంస్థల్లో 15 శాతం చొప్పున సీట్లను పొరుగు రాష్ట్ర విద్యార్థులకు కేటాయించాలని, ఈ విధానాన్ని పదేళ్ల పాటు పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీతో పాటు తెలంగాణ కూడా గడచిన పదేళ్ల పాటు ఈ నాన్ లోకల్ కోటాను అమలు చేస్తూ వచ్చాయి. అయితే పునర్విభజన చట్టం నిర్దేశించిన పదేళ్ల కాల పరిమితి గతేడాది జూన్ 2తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ లోకల్ కోటాను రద్దు చేసేసింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆ రాష్ట్రంలోని సీట్లన్నీ తెలంగాణ విద్యార్తులకే చెందుతాయి. అదే మాదిరిగా ఏపీ కూడా తన పరిదిలోని సీట్లన్నీ కూడా తన విద్యార్థులకే దక్కేలా పకడ్బందీ చర్యలు చేపట్టింది. మొన్నటి దాకా నాన్ లోకల్ కోటా అంటే.. పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్ల శాతంగా పరిగణిస్తే… ఇప్పుడు కూడా ఏపీలో నాన్ లోకల్ కోటా అమలు అవుతుంది. అయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల విద్యార్థులను రాయలసీమకు నాన్ లోకల్ గా పరిగణిస్తే… సీమ విద్యార్థులను ఆంధ్రా వర్సిటీకి నాన్ లోకల్ గా పరిగణిస్తారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈ నాన్ లోకల్ కోటాను అనుమతించరు.