-->

సెల‌బ్రిటీల నుంచి దేశ భ‌క్తి ఆశించొద్దు: ప‌వ‌న్

ఉగ్ర‌వాదాన్ని విడిచి పెట్ట‌క‌పోతే.. పాకిస్థాన్‌లోని ప్ర‌తి ఇంట్లోకీ దూరి మ‌రీ కొడ‌తామంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాయాది దేశాన్ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఇదే స‌మ‌యంలో సెల‌బ్రిటీలు(సినీ, క్రీడారంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు) నుంచి దేశ‌భ‌క్తిని ఆశించొద్ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన తిరంగా(జాతీయ ప‌తాకం) ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న‌.. అనంత‌రం బెంజి స‌ర్కిల్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. పాకిస్థాన్ ఉగ్ర‌మూక‌ల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తోంద‌న్న‌ది ప‌క్కా వాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. ఇలాంటి దేశంతో “అయ్యా.. బాబూ.. అని మాట్లాడ‌లేం. త‌న పంథాను మార్చుకోక‌పోతే..ఇళ్ల‌లోకి దూరి మ‌రీ కొడ‌తాం” అని హెచ్చ‌రించారు.

దేశ విభజన జరిగినప్పటి నుంచి భార‌త్‌కు ప్ర‌శాంత‌త క‌రువైంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. “మ‌నం అభివృద్ది చెందుతున్నాం. దీనిని చూసి ఓర్వ‌లేక పోతున్నారు. వాళ్ల‌ని మ‌నం అభివృద్ది చెందొద్ద‌ని చెప్పామా? ప్ర‌జ‌ల‌ను ధ‌న‌వంతుల‌ను చేసుకోవ‌ద్ద‌న్నామా? పాకిస్థాన్ ప్ర‌జ‌లు ఇత‌ర దేశాల్లో అడుక్కుతింటున్నారు(తాజాగా సౌదీ ప్ర‌భుత్వం పాక్ బిచ్చ‌గాళ్ల‌ను త‌రిమేసింది. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ..) అయినా.. ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఇలాంటి దేశాల‌కు త‌గిన విధంగా ప్ర‌ధాని మోడీ బుద్ధిచెబుతున్నారు” అని ప‌వ‌న్ అన్నారు.

ఉగ్ర‌వాద దాడుల‌కు మ‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు .. ప్ర‌స్తుత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాధితులేన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో ఏపీకి చెందిన ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని.. వారి కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌ని, వారు చేసిన పాపం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉమ్మ‌డి ఏపీలో.. హైద‌రాబాద్‌లోని గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్, జామా మసీదు పేలుళ్లను ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. నాటి దాడుల్లో అంగ‌వైక‌ల్యం పొందిన వారి చూస్తే.. ఇప్ప‌టికీ త‌న‌కు మ‌న‌సు క‌రిగిపోతుంద‌న్నారు.

ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల‌కు కూడా ప‌వ‌న్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. వారి పేరును ఎక్క‌డా ప్ర‌స్తావించ‌ని ఆయ‌న‌.. ‘సెక్యుల‌రిస్టులు’ అని పేర్కొన్నారు. సెక్యుల‌రిజం పేరుతో కొంద‌రు సూడో(న‌కిలీ) సెక్యుల‌రిస్టులు తెర‌మీదికి వ‌స్తున్నార‌ని.. మ‌న దేశాన్ని, సైనికుల‌ను కూడా అవ‌మానించేలా.. ఆత్మ న్యూన‌త ఏర్ప‌డేలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. వీరికి కూడా స‌రైన స‌మ‌యంలో బుద్ధి చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను తాను కోరుతున్న‌ట్టు చెప్పారు. ఇదేస‌మ‌యంలో మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు.

సినీ రంగానికి చెందిన వారి నుంచి క‌ళారంగాల‌కు చెందిన వారి నుంచి దేశ భ‌క్తిని ఆశించొద్ద‌ని వ్యాఖ్యానించారు. “సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించవద్దు” అని పేర్కొన్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌నేది ప్ర‌శ్న‌. ఇటు ద‌క్షిణాదికి చెందిన సినీ న‌టులు, అటు ఉత్త‌రాదికి చెందిన న‌టుల్లో కొంద‌రు(ప‌ట్టుమ‌ని 10 మంది మాత్ర‌మే) మోడీకి అండ‌గా ఉన్నారు. మిగిలిన వారంతా మౌనంగా ఉన్నారు. బ‌హుశ ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ వ్యాఖ్యానించి ఉంటారు.