వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి శకునం ఏమీ బాగా లేనట్లు ఉంది. ఎందుకంటే… బుధవారం ఒక్కరోజే ఆయనకు ఏకంగా రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. అవి కూడా తన సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోనే జరగడం నిజంగానే జగన్ కు డబుల్ స్ట్రోక్స్ అనే చెప్పాలి. త్వరలో టీడీపీ మహానాడు కడపలోనే జరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా పరిణామాలను చూస్తుంటే… కడపలో జగన్ తన పార్టీని కాపాడుకోగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం మధ్యాహ్నం కడప నగర పాలక సంస్థ మేయర్ గా కొనసాగుతున్న వైసీపీ కీలక నేత, జగన్ అనుంగుడు సురేశ్ బాబు తన పదవిని కోల్పోయారు. ఈ మేరకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సురేశ్ బాబుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రాగా… అవి తప్పని నిరూపించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత కొంతకాలం క్రితం ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి.
అయితే ఈ నోటీసులు రాజకీయ దురుద్దేశ్యంతో జారీ అయ్యాయని సురేశ్ బాబు ఆరోపించారు. అంతేకాకుండా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి విజయ పతాక ఎగురవేసిన రెడ్డప్పగారి మాధవి రెడ్డి ప్రోద్బలం మేరకే రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షపూరితంగా నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తానేమీ అవినీతికి పాల్పడలేదన్న సురేశ్ బాబు..తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని తెలిపారు. నోటీసులకు సమాధానం ఇచ్చే గడువు మంగళవారమే ముగియడంతో ప్రభుత్వ ఉత్తర్వులను సురేశ్ బాబు ఉల్లంఘించారని ఆరోపిస్తూ మేయర్ పదవి నుంచి తొలగించింది.
ఇక ఈ స్ట్రోక్ కంటే ముందుగా మంగళవారం రాత్రే వైసీపీకి ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన మహిళా నేత, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ రాజీనామా చేశారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం ఆమె నేరుగా బీజేపీ నేతల వద్దకు వెళ్లి కమల దళంలో చేరిపోయారు. వక్ఫ్ సవరణ బిల్లు నేపథ్యంలో జగన్ కు ఈ పరిణామం ఓ రేంజి షాకిచ్చినట్టేనని చెప్పక తప్పదు. వెరసి ఒకే రోజు రెండు భారీ దెబ్బలు తగలడంతో జగన్ బుధవారం బాగా లేదనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates