వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు దక్కించుకునేందుకు ఈ పట్టు బాగా పనిచేసింది. అయితే.. ఒక్క ఓటమితో ఈ పట్టు కదలిపోతోందన్న చర్చ తెరమీదికి వచ్చింది. ఇటీవల కీలక నాయకుడు, కొడాలికి రాజకీయ సహచరుడిగా మెలిగి, ఆయనకువెన్నుదన్నుగా ఉన్న కీలక నాయకుడు ఒకరు కొడాలికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. నిజానికి ఆయన చాలా బలమైన మద్దతుదారు.
పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి నాయకుడు ఇటీవల కొడాలిని పక్కన పెట్టారు. ఇక, తాజాగా మైనారిటీ నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న.. మహమ్మద్ ఖాసిం కూడా వైసీపీకి రాజీనామా చేశారు. నిజానికి పార్టీకి ఆయన రాజీనామా చేసినా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, మైనారిటీ ఓటు బ్యాంకును కొడాలికి చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు కావడంతో ఆయన వ్యవహారం చర్చకు దారితీసింది.
అంతేకాదు.. ఆయన కొడాలిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాని వైఖరితో విసిగిపోయామని చెప్పు కొచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని కూడా ప్రకటించారు. ఎన్నికలకు ముందు తర్వాత.. నానిలో చాలా మార్పు కనిపించిందన్న ఆయన.. ఎన్నికల తర్వాత మొత్తం పార్టీని గాలికి వదిలేశారని నానీపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. బలమైన మైనారిటీ నాయకుడు ఇలా పార్టీకి.. నానీకి కూడా రాం రాం చెప్పడం చర్చనీయాంశం అయింది.
వాస్తవానికి పార్టీలో నాయకులు కొందరు పోతూ ఉంటారు వస్తూ వుంటారు. కానీ, బలమైన ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల ఖాసిం వంటినాయకులను తయారు చేసుకోవడం చాలా కష్టం. గతంలో కొడాలి నాని.. ఖాసింని చూపిస్తూ.. నా తమ్ముడు.. నా బలం అని చెప్పుకొచ్చారు. ఏ సమస్య ఉన్నా.. ఖాసింకి చెబితే.. తనకు చెప్పినట్టేనని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి నాయకుడే ఛీ కొట్టడంతో కొడాలికి కూసాలు కదులుతున్నాయా? అనే చర్చకు దారి తీసింది. మరి కొడాలి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.