ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటికి చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడారు కదా.. ఈమె పార్టీ వీడటంలో ప్రత్యేకతమేంది? అంటారా? ఉంది… అదేంటంటే… జకియా ఏపీ శాసనమండలికి డిప్యూటీ చైర్ పర్సన్ గా ఉన్నారు.
అంటే… జకియా ఖానమ్ రాజీనామా ద్వారా వైసీపీకి ఓ ఎమ్మెల్సీ తగ్గడంతో పాటుగా సభలో డిప్యూటీ చైర్ పర్సన్ సీటు కూడా పోయినట్టే. 2019 ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత జగన్… ఏరికోరి మరి ఖానమ్ ను ఎవివేట్ చేశారు. నేరుగా అమరావతికి తీసుకుని వచ్చి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్ పర్సన్ సీటు కూడా ఇచ్చారు. అయితే 2024 ఎన్నికలకు ముందే జకియా… జగన్ కు దూరంగా జరిగారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె మరింతగా వైసీపీకి దూరం అయ్యారు. తాజాగా ఆమె వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారంటే… మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పోస్టుకూ ఆమె రాజీనామా చేసినట్టే లెక్క.
2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అంతకంతకూ క్షీణించింది. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి చాలా మంది నేతలు పార్టీని వీడారు. మోపిదేవి టీడీపీలో చేరగా… మిగిలిన ఇద్దరూ జనసేనలో చేరారు. వీరి బాటలోనే నడిచిన వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు పార్టీ వీడి తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లోనే సమర్పించారు. అయితే మండలి చైర్మన్ హోదాలో వైసీపీకి చెందిన మోషేన్ రాజు ఉండటంతో వాటిని ఆమోదించకుండా అలా పక్కనపెట్టారు. ఇప్పుడు డిప్యూటీ చైర్ పర్సన్ రాజీనామాతో ఈ రాజీనామాలపై రాజుపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… వైసీపీని వీడిన జకియా ఖానమ్ బుధవారం మధ్యాహ్నం నేరుగా వెళ్లి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ దిశగా ఇప్పటికే ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలతో చర్చలు జరిపినట్లు సమాచారం. బీజేపీలో ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే జకియా వైసీపీకి రాజీనామా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపి క్రమంగా క్షీణిస్తుండటం, కూటమిలోని పార్టీలు అంతకంతకూ బలపడుతున్న నేపథ్యంలోనే ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పక తప్పదు. త్వరలోనే మరింత మంది వైసీపీ ఎమ్మెల్సీలు, కీలక నేతలు ఆ పార్టీని వీడే ప్రమాదం లేకపోలేదన్నవార్తలు వినిపిస్తున్నాయి.