గుమ్మనూరు జయరాం… బడుగు వర్గాల నుంచి వచ్చి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగిన నేతగా ఓ రేంజి రికార్డు ఆయన సొంతం. తొలుత మెగాస్టార్ చిరంజీవితో రాజకీయ అడుగులు వేసిన ఈ బీసీ నేత… ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కర్నూలు జిల్లా ఆలూరు జడ్పీటీసీగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి ఫ్యామిలీకి కంచు కోటగా ఉన్న ఆలూరులో జడ్పీటీసీగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత అక్కడి నుంచే ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులను చేపట్టి సత్తా చాటారు. జగన్ రెండు కేబినెట్లలో కొనసాగిన అతి తక్కువ మంది నేతల్లో ఈయన ఒకరు. అలాంటి గుమ్మనూరు ఇప్పుడు పరిస్థితులేమీ అనుకూలంగా లేవనే చెప్పాలి. మంగళవారం ఆలూరు పోలీసులు గుమ్మనూరు సోదరుడు నారాయణను అరెస్టు చేశారు.
ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత 2011లో జడ్పీటీసీగా ఎన్నికైన జయరాం.. ఆలూరు అసెంబ్లీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసబెట్టి ఎమ్మల్యేగా విజయం సాధించారు. అంతేనా… 2024 ఎన్నికలకు కాస్తంత ముందుగా టీడీపీలోకి వచ్చేసిన జయరాం… ఆలూరు పొరుగు నియోజకవర్గం అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. అదేంటో గానీ… ఎప్పుడైతే ఆలూరును వీడారో అప్పటినుంచి గుమ్మనూరు కు కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. మంత్రిగా అవినీతి ఆరోపణలు రావడంతో జయరాంను జగన్ తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో గుమ్మనూరు టీడీపీలో చేరి తాను సత్తా కలిగిన నేతనే అని నిరూపించుకున్నారు.
అటు ఆలూరులో అయినా… ఇప్పుడు ఇటు గుంతకల్లులో అయినా జయరాం తరఫున అన్నివ్యవహారాలను ఆయన సోదరుడు నారాయణ చక్కబెడుతూ ఉంటారు. మొన్నామధ్య నారాయణ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ జయరాం తీరుపై జనసేన, బీజేపీ నేతలు ఏకంగా ధర్నాకు దిగారు. ఈ విషయాన్ని ముందే గమనించిన జయరాం అప్పటికప్పుడు అక్కడికి పరుగులు పెట్టి… తమ్ముడి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని వారికి సర్దిచెప్పారు. అక్కడితో ఆ సమస్య సద్దుమణగగా… తాజాగా నారాయణను ఏకంగా పోలీసులు ఓ హత్య కేసులో అరెస్టు చేయడం జయరాం రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
ఆలూరులో కాంగ్రెస్ నేతగా ఉన్న చిప్పగిరికి చెందిన లక్ష్మీనారయణ అనే వ్యక్తిని ఇటీవలే కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా లక్ష్మీనారాయణను హత్య చేసిన 11 మంది నిందితులకు నారాయణే స్వయంగా ఆర్థిక సహకారం అందించినట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం సాయంత్రం ఆలూరులో నారాయణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ హత్య కేసు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. మరి ఈ వివాదం నుంచి తన తమ్ముడిని జయరాం ఎలా రక్షించుకుంటారో చూడాలి.