‘భారత సైన్యమా.. వెనుకడుగు వేయకు.. నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు!’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంచలన పోస్టుచేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించినా.. అమితాబ్ బచ్చన్ చాలా సంయమనం పాటించారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో భారత సైన్యాన్ని.. పహల్గామ్ దాడిలో తమ నుదిటి సిందూరాన్ని కోల్పోయిన భారత పుత్రికలను ఉద్దేశించి సుదీర్ఘ పోస్టు చేశారు.
పహల్గామ్ దాడిలో తమ ముందే భర్తలను కాల్చేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు. గతంలో తన తండ్రి, ప్రఖ్యాత హిందీ కవి హరివంశ రాయ్ బచ్చన్ రాసిన కవితలను తన పోస్టులో ప్రత్యేకంగా పేర్కొ న్నారు. ‘‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా.. సిందూరం ఎక్కడని ప్రపంచం అడుగుతుంది’’ అని హరివంశ రాయ్ బచ్చన్ రాసిన కవితా సంకలనంలోని పదాన్ని ప్రస్తావిస్తూ.. అందుకే ఆమెకు సిందూరం ఇస్తున్నా.. అదే ఆపరేషన్ సిందూర్ అని బిగ్ బీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు ఘటనలను, ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. ‘‘భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భర్తను ఉగ్రవాదులు దారుణంగా హత మార్చారు. భర్తను చంపొద్దంటూ భార్య కాళ్లా వేళ్లాపడినా.. నిర్దయగా ఆ ఉన్మాది కాల్చేశాడు. ఆమె నుదుట సిందూరం తుడిచేశాడు. ఆమె ‘నన్ను కూడా చంపేయ్’ అంటూ మోకరిల్లింది. అప్పుడు ఆ రాక్షసుడు.. ‘నిన్ను చంపను. వెళ్లి.. చెప్పుకో’’ అని రాక్షసత్వం ప్రదర్శించాడు.
ఆమె నా కుమార్తెతో సమానం. ఆమె ఎంత అలమటించిపోయిందో.. నేను అర్దం చేసుకోగలను. అందుకే నాన్న(హరివంశ రాయ్ బచ్చన్) రాసిన పద్యం గుర్తుకొచ్చింది. సైన్యామా నువ్వు వెనుకడుగు వేయకు. నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఇది భారతీయుల సంకల్పం. ఆపరేషన్ సిందూర్! అని బిగ్ బీ పోస్టులో పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates