ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవడం లేదని నర్మగర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తమ విధానం ఎప్పుడూ మారబోదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో పాకిస్థాన్‌కు ప్రత్యామ్నాయ మార్గం అంటూ మరొకటి లేదని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్నయితే ఆక్రమించుకుందో.. దానిని తిరిగిభారత్‌కు ఇచ్చేయాలని స్పష్టం చేశారు.
ఇంతకు మించిన ఆశలు ఉంటే పాక్‌కు వాటిని విరమించుకోవాల్సిందేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ నుంచి ఇంతకన్నా ఎక్కువగా ఊహించుకోవద్దని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. 140 కోట్ల మంది ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం పాక్ ఆక్రమిక కశ్మీర్‌ను చేజిక్కించుకోవడం ఒక్కటే మా అజెండా. దీనిని భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు. కశ్మీర్ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదు
అని మోడీ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. కాల్పుల విరమణ అవగాహనను పాకిస్థాన్ వైలేట్ చేయడంపై ప్రధాని సుదీర్ఘంగా త్రివిధ దళాధిపతులతో చర్చించారు. ప్రస్తుతం పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటలకు పైగానే ఈ చర్చలు జరిగాయి. దీనిలో విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్‌పై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.