వలంటీర్లకు శిక్షణ ఇచ్చారంట, బిల్ – రూ.272 కోట్ల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా… ఏపీ ప్రజలకు ఓ అద్భుతమైన వ్యవస్థను అందించానని, దానిని కూటమి సర్కారు రద్దు చేసిందని వలంటీర్ వ్యవస్థ గురించి చెబుతున్న సంగతి తెలిసిందే. సేవ చేసేందుకే వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పిన మాట నిజమేనని.. అయితే ఆ సేవ ప్రజలకు కాకుండా… వైసీపీకి మాత్రమే అందిందని నాటి విపక్షం, నేటి అధికార కూటమి సారథి టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీది ఆరోపణ కాదని నూటికి నూరు పాళ్లు నిజమైన మాటేనని తేలిపోయింది. వలంటీర్లు సేవ చేసిన మాట నిజమేనని… అయితే ఆ సేవ ప్రజలకు కాకుండా వైసీపీకి మాత్రమే అందిందని తేలిపోయింది.

గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాలను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కారు… ఆ సచివాలయాలు, ప్రజలకు మధ్య వారధులు అంటూ వలంటీర్లను నియమించి.. వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.5000 అందించింది. మీకు ప్రజలకు చేసేది సేవ మాత్రమేనని, అందుకే మీకు వేతనాన్ని కాకుండా గౌరవ వేతనాన్ని అందిస్తున్నామని జగన్ పదే పదే చెప్పేవారు. సరే… ఎలాగూ ఇంటి వద్ద ఊరకే ఉంటున్నాం కదా అని యువత కూడా ఆ సేవ చేస్తూ సాగారు. అయితే ప్రజలకు సేవ పేరిట వలంటీర్లతో వైసీపీ తన సేవ చేయించుకుంది. పథకాల పేరిట ప్రజల వివరాలను సేకరించడంతో పాటుగా వారిలో వైసీపీ పట్ల సానుకూలతను నాటారు. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి విష బీజాలను నాటారు.

ఇదంతా ఇప్పుడెలా బయటపడిందంటే… వలంటీర్ వ్యవస్థ గురించి ఆరా తీస్తూ ఉంటే… ఆ వ్యవస్థలోని వలంటీర్లకు శిక్షణ నిమిత్తం ఏటా రూ.68.62 కోట్లను నాటి వైసీపీ సర్కారు ఖర్చు చేసింది. వలంటీర్లకు శిక్షణ కాంట్రాక్టుకు రామ్ ఇన్ ఫో అనే సంస్థకు ప్రభుత్వం ఇవ్వగా… నాలుగేళ్ల పాటు ఆ సంస్థకు ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించింది. ఈ లెక్కన ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి ఏకంగా రూ.272 కోట్ల మొత్తం ముట్టింది. అయితే క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా రామ్ ఇన్ ఫో అన్న పేరే వినిపించలేదు. ఆ సంస్థ ఇచ్చిన శిక్షణ దాఖలా కూడా కనిపించలేదు. వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐప్యాక్ సభ్యులే అక్కడక్కడా వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.

ఇక రామ్ ఇన్ ఫో బదులుగా ఐప్యాక్ శిక్షణ ఇచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు, ప్రజలను ఎలా మాయ చేయాలి? ప్రజలను ఎలా మభ్యపెట్టాలి? అన్న విషయాలను ఆయా పార్టీలకు అందించిన ఐప్యాక్.. వలంటీర్లకు అవే సూత్రాలను కాకుండా సేవ ఇలా చేయండి అని ఎలా చెప్పి ఉంటుంది? అయినా తాను శిక్షణ ఇస్తే.. శిక్షణ ఇచ్చే సంస్థగా తన పేరును చేర్చుకునే అవకాశం ఉన్నా… తాను వెనకుండి… రామ్ ఇన్ ఫో పేరిట మరో సంస్థను రంగంలోకి దించిందంటేనే ఇందులో ఏదో మతలబు ఉందని ఇట్టే చెప్పేయొచ్చు. మొత్తంగా ఈ విషయం బయటకు రావడంతో వలంటీర్ల అసలు లక్ష్యం ఏమిటో ఆలస్యంగా అయినా బయటపడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.