పంతాలకు పోవద్దు.. కలిసి మెలిసి పనిచేయండి.. అని సీఎం చంద్రబాబు తరచుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెబుతున్నారు. అంతేకాదు.. నియోజకవర్గాల గొడవలను పెద్దవి కూడా చేసుకోవద్దని ఆయన సూచిస్తున్నారు. అయినా.. ఆయన మాటలను పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీ శబరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడిక్కడ నాయకులు శబరికి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. వీరికంటే నేనేం తక్కువ అంటున్న శబరి కూడా.. అలానే వ్యవహరిస్తున్నారు.
దీంతో పలు నియోజకవర్గాల్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో అటు వ్యక్తిగతంగా నాయకులు, ఇటు పార్టీ పరంగా టీడీపీ కూడా చిక్కుల్లో పడుతున్నాయి. తాజాగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు.. ఎంపీ శబరికి మధ్య ఉన్న వివాదాలు.. కాస్తా రోడ్డెక్కాయి. ఇది అధికారిక కార్యక్రమం సాక్షిగా వెలుగులోకి రావడంతో పార్టీపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అసలు పార్టీలో ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా నాయకుల మధ్య సఖ్యత లేకుండా పోయిందన్నది ఆసక్తిగా మారింది. చంద్రబాబు చెప్పింది వారికి అర్ధం కావడం లేదా? లేక వారే వినిపించుకోవడం లేదా? అనేది కూడా ఆసక్తిగా మారింది.
ఏం జరిగిందంటే.. నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా ఫైర్ స్టేషన్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి శంకు స్థాపన జరపాలని సంబంధిత అధికారులను మంత్రి అనిత ఆదేశించారు. దీంతో అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ప్రొటోకాల్ ప్రకారం.. కర్నూలు ఎంపీ, నందికొట్కూరు ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే.. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి ఎంపీని ఎందుకు పిలిచారంటూ.. అధికారులను నిలదీసిన జయసూర్య.. ఆ తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముహూర్తం సమయాన్ని కనుక్కుని.. ఎంపీ రావడానికి ముందే వెళ్లి.. శంకుస్థాపన చేసేశారు.
అనంతరం.. తన మానాన తను వెళ్లిపోయారు. అయితే.. ఈ విషయం తెలియని ఎంపీ శబరి.. అక్కడకు చేరుకునే సరికి అదికారులు కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసేశారని చెప్పారు. దీంతో ఎంపీ.. ప్రొటోకాల్ ప్రకారం తాను వచ్చే దాకా ఎందుకు ఆగలేదని అధికారులను నిలదీశారు. ఏతావాతా ఇద్దరితోనూ.. అధికారులుచీవాట్లు తిన్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యే చేసిన శంకుస్థాపనకు పక్కనే శబరి కూడా.. మరో శంకుస్థాపన కార్యక్రమం చేసి.. వెళ్లిపోయారు. అంతేకాదు.. వస్తూ.. వస్తూ.. తనను పిలిచినప్పుడు.. తనతోనే శంకుస్థాపన చేయించాలని.. నిధులు ఇచ్చేది ఎవరనేది కాదన్నారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. ఇక, జయసూర్య వెంట వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. ఆయనతో వెళ్లిపోయారు. శబరి వెంట తక్కువ మంది మాత్రమే కార్యక్రమానికి వచ్చారు. దీంతో టీడీపీలో జరుగుతున్న వివాదాలు మరోసారి వీధికెక్కాయన్నది చర్చగా మారింది.