ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు. మీసం మెలేసి మరీ ప్రతిపక్ష పార్టీలకు సవాళ్లు రువ్విన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు.. అసెంబ్లీ వేదికగానే తొడగొట్టే ప్రయత్నం చేసిన నాయకుడు. కానీ, ఇప్పుడు పార్టీ అధికారం నుంచి దిగిపోయే సరికి.. ఆయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏకేసు తనను చుట్టుముడుతుందోనన్న బెంగ వేధిస్తోంది. అలాగని మౌనంగా ఉంటే.. పార్టీ నుంచి తన కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు భరించలేక పోతున్నారట. ఈ క్రమంలో నిరసనలకు, ధర్నాలకు పిలుపుని చ్చి.. ఆనక పక్కాగా తప్పించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఆయనే వైసీపీకి చెందిన మాజీ మంత్రి.. నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్. ఎన్నికలు ముగిసి ఏడాది అవుతున్నా.. ఆయన పెద్దగా ప్రజల్లో కనిపించడం లేదు. మాట కూడా వినిపించడం లేదు. ఎక్కడ నోరు విప్పితే కేసులు చుట్టుకుంటాయోనని ఆయన బెంగ పెట్టుకున్నారని వైసీపీ నాయకులు చూచాయగా చెబుతున్నారు. ఇక, ప్రస్తుతం తన పరివా రం అనుకున్నవారంతా టీడీపీలో ఉండడం.. బలమైన కోటంరెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడం తెలిసిందే. దీంతో మరింత హర్ట్ అయిన పోలుబోయిన.. ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోలేక.. అలాగని నాయకులకు సర్దిచెప్పలేక ఇబ్బంది పడుతు న్నారు.
తాజాగా ఆయన సైదాపురంలోని శ్రీనివాస పద్మావతి మైనింగ్ సంస్థ లెక్కకు మిక్కిలిగా గనులు తొవ్వేస్తోందని అనిల్ కుమార్ ఆరోపించారు. లీజు గడువు ముగిసినా.. దీనిని కొనసాగిస్తున్నారని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారని కూడా ఆయన చెబుతున్నారు. దీంతో నేరుగా అక్కడకు వెళ్లి.. నిజాలు బయట పెడతానని, నాయకుల భరతం పడతానని చెప్పుకొచ్చారు. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. అయితే.. ఆయన అనుకున్న విధంగా చేయలేదు. కనీసం కార్యకర్తల ను కూడా ఘటనా స్థలానికి తరలించలేక పోయారు. దీంతో వెంటనే కార్యక్రమం రద్దు చేసుకున్నారు.
ఇక, ఈ వ్యవహారంపై సొంత పార్టీలోనే భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. అనిల్ వస్తున్నాడని తెలియగానే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన మాట వాస్తవం. మైనింగ్ మార్గానికి దారితీసే రోడ్డులో పెద్ద ఎత్తున 100 మందికి పైగా కానిస్టేబుళ్లు.. ఐదా రుగురు ఎస్సైలు, ఇద్దరుముగ్గురు సీఐలు అక్కడకు చేరుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. గనుల ప్రాంతానికి వెళ్లే సైదాపురం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. దీంతో అనిల్ కుమార్ రాలేదన్నది ఒక వాదన. అంటే.. తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి ఆయన రాలేదన్నది కొందరు చెబుతున్నారు. మరోవైపు.. అసలు ఈ చిన్న విషయానికి ఇంత మంది పోలీసులు ఎందుకు వచ్చారు? దీనివెనుక అనిల్ వ్యూహం ఉండి ఉంటుందన్నది మరో వాదన. మొత్తానికి ఈ విషయంలో అనిల్ చేతులు ఎత్తేశారు. దీంతో పోలుబోయిన వ్యవహారం వైసీపీలోనే ఆసక్తికర చర్చగా మారింది.