భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ప్రకటించారు.
ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ఈ నెల 12న పాకిస్థాన్ విదేశాంగ శాఖతో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓ, పాక్ డీజీఎంఓలకు ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరామని మిస్రీ తెలిపారు.
భూ,గగన, సముద్రతలాలకు కాల్పుల విరమణ వర్తిస్తుందని చెప్పారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరుగుతాయన్నారు. పాక్ మంత్రి ఇషాక్‌దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు వెల్లడించారు. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరపడినట్లయింది.
కాగా, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉన్న పలు రాష్ట్రాలలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయన్న వార్త విని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates