శభష్ లోకేష్ – విదేశీయులతోనూ కొబ్బరికాయ కొట్టించారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన శ్రీసిటిలో నూతనంగా ఏర్పాటు కానున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ యాజమాన్య ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. దాదాపుగా రూ.5,860 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ తమకు అత్యంత కీలక స్థావరంగా మారనుందని ఎల్జీ యాజమాన్యం భావిస్తోంది. అందుకే కాబోలు కంపెనీ యాజమాన్యం నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.

ఈ సందర్భంగా ఎల్జీ యాజమాన్య ప్రతినిధులతో కలిసి లోకేశ్ భూమి పూజలో పాలుపంచుకున్నారు. అందులో భాగంగా హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకున్న లోకేశ్… తనతో పాటు ఎల్జీ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు కూడా ఆ సంప్రదాయాలను పాటించేలా చూశారు. కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టే సమయంలో కాళ్లకు ఉన్న చెప్పులను వదిలేసిన లోకేశ్… వంగి మరీ కొబ్బరి కొట్టారు. ఆ తర్వాత ఎల్జీ యాజమాన్య ప్రతినిధులు కూడా తన మాదిరే బూట్లు తీసి మరీ కింద కూర్చుని కొబ్బరికాయ కొట్టేలా లోకేశ్ చూసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వీడియోను గురువారమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలుగు మహిళ అధ్యక్షురాలు, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సంప్రదాయాలు తెలిసి కూడా గత ప్రభుత్వంలో యజ్ఞ, యాగాలకు చెప్పులు వేసుకుని వెళ్లిన మనుషులు ఉన్నారని, ఒంగి కొబ్బరికాయ కొట్టలేక మీడియాలో వార్తలకెక్కిన వారూ ఉన్నారని ఆమె సెటైర్లు సంధించారు. అంతేకాకుండా తనతో పాటుగా విదేశీయులను కూడా మన సంస్కృతి గొప్పదనాన్ని వివరించి వారితోనూ మన ఆచారాలు ఆచరింపజేశారని ఆమె లోకేశ్ ను ఆకాశానికెత్తేశారు.