పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు ప్రబల నిదర్శనాలు కనిపించాయి. పహల్ గాం ఉగ్ర దాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలనే భారత్ టార్గెట్ చేసింది. అంతేకాకుండా తాము ఇప్పటిదాకా పాక్ పౌర సమాజాన్ని గానీ, ఆ దేశ సైనిక స్థావరాలను టార్గెట్ చేసి గానీ దాడులే చేయలేదని కూడా భారత సైన్యం అధికారికంగానే ప్రకటించింది. అయితే పాక్ ఈ వ్యవహారంలో దొంగ దారిని అవలంబించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైపోయింది.

భారత్ లోని పటిష్ట ఎయిర్ బేస్ కలిగిన పఠాన్ కోట్ ను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం వైమానిక దాడికి దిగింది. అయితే ఈ తరహా దాడులను ముందే పసిగట్టిన భారత్… పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ప్రాధాన్యం, దానిపై గతంలో జరిగిన దాడులను గుర్తు చేసుకుని మరీ భారత్ అక్కడ పటిష్ట భద్రతా వ్యవస్థను రంగంలోకి దించింది. పఠాన్ కోట్ వైపు దూసుకువచ్చిన పాక్ ఫైటర్ జెట్ విమానాన్ని భారత్ కూల్చేసింది. ఈ ఘటనలో పాక్ జెట్ లోని ఆ దేశ పైలట్ కూడా భారత్ కు పట్టుబడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

అదే సమయంలో భారత్ సరిహద్దు వెంట ఉన్న పలు కీలక పోస్టులు అయిన సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పుర, ఆర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లను పాక్ ప్రయోగించింది. వీటిని కూడా భారత్ గాల్లోనే పేల్చి పారేసింది. తాను చేసిన దాడులు విఫలమైన నేపథ్యంలో పాక్ తన సిసలైన దొంగ బుద్దిని బయటపెట్టుకుంది. తాము భారత్ పై ఇప్పటిదాకా ఎలాంటి దాడులే చేయలేదని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. అయితే పాక్ కవ్వింపు చర్యలతో లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి వంటి ప్రాంతాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థను బారత్ ధ్వంసం చేసింది.

ఇదిలా ఉంటే…భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలను పరిశీలిస్తూ వస్తున్న అగ్రరాజ్యం అమెరికా… గురువారం నాటి పరిస్థితులను తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగిపోయింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రుబియో పాక్, భారత్ లకు ఫోన్లు చేశారు. పాక్ ప్రధానితో మాట్లాడిన రుబియో…యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలని సూచించారు. అదే సమయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోనూ ఆయన మాట్లాడారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాల్సిన అవసరాన్ని రుబియో నొక్కి చెప్పారు.