అన్ని పాపాలకు ఒకేసారి సమాధానం!

భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు. వేల మందిని పొట్టనబెట్టుకున్నారు. వందలాది దాడులకూ తెగబడ్డారు. అయితే ఈ దాడులపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వస్తున్న భారత్… వాటన్నింటికీ ఇప్పుడు ఒకేసారి గట్టిగానే బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటుగా దుష్ట పన్నాగాలు పన్నుతున్న పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది.

బుధవారం తెల్లవారు జామున భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ భూభాగం కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల్లో ఏకంగా 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 1999లో ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసిన మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నట్లుగా సమాచారం. ఐసీ 814 విమానం హైజాక్, అనంతరం భారత్ విడుదల చేసిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ తమ్ముడే ఈ అబ్దుల్ రవూఫ్. నాడు తన అన్న మసూద్ ను విడుదల చేయించుకునేందుకు రవూఫ్ ఐసీ814 విమానాన్ని అతడు హైజాక్ చేశాడు.

నాడు బీజేపీ అధికారంలో ఉండగా… దివంగత నేత అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా కొనసాగుతున్నారు. 176 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి బయలుదేరిన ఐసీ 814 విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే అప్పటికే అరెస్టైన తన సోదరుడిని విడిపించుకునేందుకు రవూఫ్ ఈ విమానాన్ని హైజాక్ చేశాడు. ఆ తర్వాత దానిని ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కు తరలించాడు. ప్రయాణికుల్లో 27 మందిని దుబాయిలో దించేసిన దుండగులు… ఒకరిని దారుణంగా హత్య చేశారు.

అనంతరం విమానాన్ని కాందహార్ లో ల్యాండ్ చేసి… మసూద్ అజార్ ను విడుదల చేస్తే తప్పించి విమానాన్ని, అందులోని ప్రయాణికులను వదిలేది లేదని రవూఫ్ బృందం తెలిపింది. ఉగ్రవాదులతో వారం పాటు చర్చలు జరిపిన భారత ప్రభుత్వం ఎట్టకేలకు మసూద్ ను విడుదల చేసి… విమానాన్ని, ప్రయాణికులను విడిపించుకుంది. ఆ తర్వాత జైైష్ ఏ మొహ్మద్ పేరిట ఓ ఉగ్రవాద సంస్థను మసూద్ స్థాపించగా… దానిలో రవూఫ్ కీలక కమాండర్ గా ఎదిగాడు. ఐక్యరాజ్యసమితితో పాటుగా అమెరికా కూడా ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి.

పాక్ భూభాగంలోని జైష ఏ మొహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసిన భారత త్రివిధ దళాలు… బుధవారం తెల్లవారుజామున ఆపరేషన సిందూర్ పేరిట పేల్చివేశాయి. ఈ దాడుల్లో జైష్ ఏ మొహ్మద్ కు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం కాగా… వాటిలోని ఓ స్థావరంలో తలదాచుకున్న రవూఫ్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉన్నతాధికార వర్గాలు ధృవీకరించాయి. మొత్తంగా ఏళ్ల తరబడి భారత్ కు చిక్కకుండా తప్పిచుకు తిరుగుతున్న రవూఫ్…ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ లో హతమైపోయాడు.