తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ మీ జాగీరా అంటూ మంగళవారం జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సందర్భంగా కేటీఆర్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై సూటిగా స్పందించిన కేటీఆర్… పవన్ చేసిన ఒక్కో మాటను గుర్తు చేస్తూ మరీ తన స్పందనను తెలియజేశారు. తెలంగాణ ముమ్మాటికీ మా జాగీరేనని ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
పవన్ కల్యాణ్ తనను తెలంగాణలో ఎవరో అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అదంతా ఒట్టి బూటకమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ను తెలంగాణలోకి అడుగుపెట్టకుండా ఏ ఒక్కరూ అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు.
పవన్ కల్యాణే తనలో తాను ఏదో ఊహించుకుంటూ… తనను ఎవరో అడ్డుకుంటున్నారంటూ ప్రభంజనాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పవన్ ను అడ్డుకుంటే.. 2018, 2023 ఎన్నికల్లో జనసేన పోటీ చేసేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా పోటీ చేయవచ్చని చెప్పిన కేటీఆర్.. జనసేన కూడా పోటీ చేసిన విషయాన్ని పవన్ మరిచారా? అని ప్రశ్నించారు.
పవన్ ప్రస్తావించిన ప్రాంతీయ వాదం తీవ్రవాదం కంటే ప్రమాదకరమైనదన్న వాదననూ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రాంతీయవాదం తప్పు అయితే మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు చేసింది తప్పేనా? అని ఆయన ప్రశ్నించారు.
ఇక దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఆర్థిక ప్రాంతీయవాదాన్ని పెంచి పోషిస్తున్నారని, మరి మోదీని ఇదేమిటని ప్రశ్నించగలరా? అంటూ ఆయన పవన్ ను ప్రశ్నించారు.తెలంగాణకు వచ్చిన ప్రాజెక్టులను ప్రధాని హోదాలో మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ కు తీసుకుని వెళ్లారు కదా.. దానిని ఏమంటారని కూడా ఆయన నిలదీశారు.
వపన్ తెలంగాణకు వచ్చి పోవడం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని కేటీఆర్ అన్నారు. అయితే తెలంగాణకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి అన్న విషయంపై పవన్ ఓ అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ తో పాటు ఏపీకి చెందిన చాలామంది కుటుంబాలు, వ్యాపారాలు తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్… వాటికి ఎప్పుడైనా చిన్న ఇబ్బంది అయినా కలిగిందా? అని ప్రశ్నించారు. ఇక జనగణమన గురించి పవన్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల్లోని దేశభక్తి గురించి పవన్ ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదని ఆయన చురకలంటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates