ఎంపీలకు తమ నియోజకవర్గం పరిధిలోని శాసన సభ స్థానాల పై పట్టు ఉండడం వేరు. ఎందుకంటే.. ఎంపీ లాడ్స్ నుంచి నిధులను ఆయా నియోజకవర్గాలకు ఖర్చు చేయడం.. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించడం వరకు ఓకే. కాబట్టి శాసన సభ్యులపైనా.. ఆయా నియోజకవర్గాలపైనా పట్టు పెంచుకునేందుకు ఎంపీలు ప్రయత్నిస్తారు. ఇది తప్పుకాదు. అయితే.. ఒకరిద్దరు ఎంపీలు మాత్రం ఏకంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని జిల్లాలపైనే పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ.. వీరు సక్సెస్ కాలేకపోతున్నారు.
ఇలాంటి వారిలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఒకరు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉంది. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కలిపి.. పార్లమెంటు స్థానంగా ఉంది. తిరుపతిలోని చంద్రగిరి అసెంబ్లీ స్థానం, చిత్తూరు జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ స్థానాలు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లాపై పట్టు పెంచుకునేందుకు దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రయత్నిస్తున్నారు.
తరచుగా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారులను కూడా తన గ్రిప్‌లో ఉంచుకుంటున్నారు. దీంతో ఈ జిల్లాలోని ఈ నియోజకవర్గాల్లో దగ్గుమళ్ల మాటే శాసనంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. కొందరు ఆయన అనుచరులు చక్రం తిప్పుతున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం చిత్తూరు పార్లమెంటు పరిధిలో లేదు. అదే.. పుంగనూరు. పైగా ఇది వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం. ఇది ఆయన కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉంది. కానీ, జిల్లా పరంగా చూసుకుంటే అది చిత్తూరు జిల్లాలోనే ఉంది.
ఈ నేపథ్యంలో అక్కడకూడా తనమాటే నెగ్గాలన్న ఉద్దేశంతో దగ్గుమళ్ల రాజకీయం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా.. తనకు తెలిసే జరగాలని.. రూపాయి కూడా ఎక్కువ నిధులు ఇవ్వడానికి వీల్లేదని ఆయన శాసిస్తున్నారు. అయితే.. దగ్గుమళ్లకు సంబంధం లేని నియోజకవర్గంలో ఆయన చెప్పినట్టు చేసేందుకు కలెక్టర్ సుతరాము ఇష్టపడడం లేదు. దీంతో ఆ వివరాలను మీకు ఇవ్వలేనంటూ.. అధికారులు తెగేసి చెబుతున్నారు. కానీ… దగ్గుమళ్ల మాత్రం పట్టుబడుతున్నారు.
పైగా ఇది పెద్దిరెడ్డి నియోజకవర్గం కావడంతో అందరూ ఆయన మాటే వింటుండడం కూడా.. ఎంపీకి మంటెత్తిస్తోంది. అయినా.. ఏమీ చేయలేని నిస్సహాయత. అలాగని తన మాట చెల్లించుకోలేక పోతే.. ఎలా అన్నది ప్రశ్న. దీంతో అధికారులపై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారట. కలెక్టర్‌ను బదిలీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా.. దగ్గుమళ్లకు సీఎం చంద్రబాబు దగ్గర మంచి మార్కులు ఉండడం గమనార్హం.