రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు. తాజా పార్టీ పార్లమెంటరీ ఇంచార్జ్‌లతో తాడేపల్లిలో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున బలంగా పోరాడాలని సూచించారు. కొందరు ఇంచార్జ్‌లు పనిచేయడం లేదని పేర్కొన్నారు. వారి జాబితా తన దగ్గర ఉందన్నారు. అయితే ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశం, వారిని బెదిరించే ఉద్దేశం తనకు లేదన్న జగన్, అందరూ కలిసికట్టుగా ఉంటేనే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని జగన్ చెప్పారు. 2029 వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని జగన్ చెప్పారు. అందరూ దానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. త్వరలోనే తాను ప్రజల మధ్యకు రానున్నట్లు తెలిపారు. సమస్య ఏదైనా తనకు చెప్పాలని, అంతర్గత వివాదాలు తగ్గించుకోవాలని సూచించారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉందన్న సమాచారం తనకు అందినట్లు తెలిపారు.
కాగా ఇటీవల పార్లమెంటు నియోజకవర్గాలకు వైసీపీ అధినేత జగన్ కొత్త ఇంచార్జ్‌లను నియమించారు. అయితే వారిలో కొందరు తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు. త్వరలోనే మళ్లీ మార్పులు ఉంటాయని, అప్పటి వరకు సర్దుకుపోవాలని ఆయన సూచించారు. పార్టీ పరిస్థితిని అంచనా వేయాలని అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. “మన మీద కొందరు కక్ష కట్టారు. పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారు. వారిని మీరు అడ్డుకోవాలి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
“వైసీపీ పార్టీ లేకపోతే సామాన్యులు ఇబ్బంది పడతారు. మనం ఉన్నాం కాబట్టే సూపర్ సిక్స్ అమలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. మనం బలంగా ఉండాలి. ఈ విషయంలో తేడా రావొద్దు” అని జగన్ సూచించారు. కాగా బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన ఈ సమావేశానికి చాలా తక్కువ మంది నాయకులు హాజరుకావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates