భారత న్యాయవ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఇకపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేస్తూ ప్రజల ఆంతర్యానికి అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 2025 ఏప్రిల్ 1 ఫుల్ కోర్ట్ సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని తాజాగా మీడియాకు వెల్లడించింది.
ఈ నిర్ణయంతో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా, న్యాయమూర్తులపై అనవసర ఆరోపణలకు చెక్ వేయవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 21 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను ఇప్పటికే సమర్పించగా, మిగతా న్యాయమూర్తుల వివరాలను అందిన వెంటనే అప్‌లోడ్ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
ఇది పూర్తిగా తప్పనిసరిగా మార్చిన మొదటి చారిత్రాత్మక నిర్ణయంగా నిలవనుంది. గతంలోనూ ఇదే అంశంపై తీర్మానాలు చేసినా అవి స్వచ్ఛంద పద్ధతిలో కొనసాగాయి. 1997లో మొదటిసారి న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను గోప్యంగా ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలన్న నియమం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత 2009లో స్వచ్ఛందంగా వెబ్‌సైట్‌లో పొందుపర్చే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియను కట్టుబాటుగా మార్చారు.
ఇదొక వినూత్న మార్గదర్శక నిర్ణయంగా భావించబడుతోంది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ విశ్వాసానికి బలమివ్వాలంటే, ఈ విధంగా పారదర్శక చర్యలు తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ విధానం ఇతర న్యాయస్థానాలకూ స్ఫూర్తిగా మారే అవకాశం ఉంది.