భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే తాటిపై నడిపించడంలోనూ.. మాత్రం ఇప్పుడు కొత్త పంథా అనుసరించింది. అది కూడా భిన్నమైన అంతర్గత రాజకీయాల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం ఏకత్వాన్ని దక్కించుకుంది. తాజాగా జరిగిన సిందూర్ దాడులపై యావత్ దేశం.. ఏకతాటిపై నిలిచింది. ఒకప్పుడు భారత్ తగిన విధంగా జవాబు ఇచ్చినప్పుడు.. కాంగ్రెస్ సహా.. కమ్యూనిస్టుల నుంచి విమర్శలు.. వాగ్బాణాలు వచ్చేవి.
ఉదాహరణకు చైనా-భారత్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో 2020లో జరిగిన దాడిపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. మనం జాగ్రత్తగా ఉంటే ఈ ఉపద్రవం వచ్చేది కాదన్నారు. ఇక, ఉరి సెక్టార్‌లో ఉగ్రమూకలు రణరంగం సృష్టించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని తప్పుబట్టింది. ఆయన సరైన విధంగా ఎదుర్కొనలేదని పేర్కొంది. సర్వసన్నద్ధంగా ఆర్మీని సిద్ధం చేయలేకపోయారని.. అందుకే ఇంత విపత్తు వచ్చిందని మాట తూటాలు పేల్చింది. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా ఇలానే ఆరోపణలు వచ్చాయి.
కానీ, తాజాగా జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ మాత్రం దీనికి భిన్నంగా మారింది. కొంచెం లేటైనా.. వాటంగా పాక్‌కు జవాబు చెప్పారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. మిత్రపక్షాల నుంచి మెచ్చకోళ్లు రావడం సహజం.. కానీ.. మోడీ అంటే గిట్టని పశ్చిమ బెంగాల్ సీఎం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వరకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి దాకా.. యావత్ భారతావని.. సిందూర్ దాడులపై ఏకకంఠంతో జయహో నినాదాలను ప్రతిధ్వనిస్తోంది.
మోడీ వలన- మోడీ చేత- అంటూ.. ప్రతి ఒక్కరూ ఆయనను కొనియాడుతున్నారు. ఇక, రాష్ట్రాల్లో ప్రజలు బుధవారం ఉదయం నుంచి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక, దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి 7 నుంచి 8 మధ్య కొవ్వుత్తుల ర్యాలీలు, పహల్గామ్ మృతులకు మరోసారి నివాళులర్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏపీలో అయితే.. స్పీకర్ నుంచి సీఎం వరకు.. అందరూ మోడీ వెంటే ఉంటామని మరో సారి స్పష్టం చేశారు. సో.. ఇది జాతి విజయంగా ప్రతి ఒక్కరూ పేర్కొనడం విశేషం. ఈ తరహా యూనిటీ గతంలో జరిగిన దాడుల విషయంలో రాకపోవడం గమనార్హం.