తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం మధ్యాహ్నం సంచలన తీర్పు వెలువరించింది. దాదాపుగా 14 ఏళ్ల పాటు విచారించిన ఈ కేసులో బీజేపీ మాజీ నేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డితో పాటు ఆయన నేతృత్వంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ), ఆ సంస్థ ఎండీ శ్రీనివాస్ రెడ్డిలను దోషులుగా తేల్చిన కోర్టు వారికి శిక్షలనూ ఖరారు చేసింది. వీరితో పాటు నాటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి వ్యక్తిగత కార్యదర్శి అలీ ఖాన్ లకూ శిక్షలు ఖరారు చేసింది. ఇక ఈ కేసులో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన ప్రస్తుత బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పదవులు అనుభవించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సబితతో పాటుగా ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంను కూడా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇక ఈ కేసులో తన సర్వీసులో అత్యంత విలువైన సమయాన్ని కోల్పోయి… జైల్లో మగ్గిపోయిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మీకి గతంలోనే కోర్టు ఈ కేసు నుంచి విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే.
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా పరిధి కర్ణాటక సరిహద్దులోని డీ హీరేహాల్ మండలంలోని ఓబుళాపురంలో ఉక్కు గనులను గాలి జనార్థన్ రెడ్డి కంపెనీగా తీర ముందుకు వచ్చిన ఓఎంసీకి కేటాయించారు. నాడు తనకు కేటాయించిన పరిధిని అతిక్రమించిన గాలి… పరిసర ప్రాంతాలను తవ్వేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. అందులో భాగంగా ఓ గుట్టల్లో ఉన్న ఓ ఆలయాన్ని కూడా గాలి అనుచరులు ధ్వంసం చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ క్రమంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు. ఆ తర్వాత ఓఎంసీ అక్రమాలపై రోశయ్య హయాంలో కేసు నమోదు కాగా… గనుల కేటాయింపులను రద్దు చేశారు. నాటి నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ 2011లో తొలి చార్జీషీట్ ను నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. ఈ క్రమంలో గాలితో పాటు శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్ తదితరులు అరెస్టు కాగా.. ఆ తర్వాత చాలా కాలానికి వారు బెయిల్ పై రిలీజ్ అయ్యారు. అయితే ఈ కేసు మాత్రం నత్తనడకన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ నెల 10లోగా తుది తీర్పు వెల్లడించాలని గడువు విధించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం మధ్యాహ్నం ఓఎంసీ కేసులో తన తుది తీర్పును వెలువరించింది. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు 219 మంది సాక్షులను విచారించింది. 3,400 డాక్యుమెంట్లను పరిశీలించింది. అంతిమంగా మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో శ్రీలక్షీకి ఈ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించగా… ఆమె ప్రస్తుతం ఏపీ కేడర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ కేసులో ఓ నిందితుడు విచారణ సాగుతుండగానే చనిపోయారు. ఇక దోషులుగా తేలిన గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీ ఖాన్, ఓఎంసీ కంపెనీలకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటుగా రూ.1 లక్ష జరిమానాను విధించింది. నాడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా… ఆమెకు ఇప్పటిదాకా ఉపశమనం లభించలేదు. అంతేకాకుండా తనకూ ప్రమేయం లేదని కృపానందం కూడా వాదించినా ప్రయోజనం లేకపోయింది. అయితే తుది తీర్పులో మాత్రం సబిత, కృపానందంలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉంటే… ఈ కేసులో ఇప్పటికే చాలా కాలం పాటు జైల్లోనే మగ్గిన గాలి జనార్థన్ రెడ్డి… మంగళవారం నాటి తీర్పు సందర్భంగా కోర్టు ముందు ఓ వింత వాదనను వినిపించారు. తన కంపెనీల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా తనకు శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే గాలి జనార్థన్ రెడ్డి ప్రతిపాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దాదాపుగా రూ.884 కోట్ల మేర ప్రజా ధనం వృథా అయిన ఇంతటి తీవ్ర కేసుల్లో శిక్షల నుంచి ఉపశమనం కల్పించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా సొమ్మును కొల్లగొట్టిన ఈ కేసులో పదేళ్ల పాటు ఎందుకు జైలు శిక్ష వేయకూడదని కూడా కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే… దోషులుగా తేలి ఏడేళ్ల జైలు శిక్షలు ఖరారైన నిందితులను మరికాసేపట్లోనే జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితురాలిగా ఉండి తుది తీర్పు సందర్భంగా కోర్టుకు వచ్చిన సబిత మాత్రం నిర్దోషిగా తేలి ఇంటికి వెళ్లిపోయారు. కృపానందం కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు.