ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా అందుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను ప్రభుత్వానికి మంచి మార్కులే వేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు పాలనకు మరిన్ని మార్కులు పడేలా చేస్తోంది. అందుకే.. పింఛన్.. బాబుకు మార్కులు పెంచెన్ అనే కామెంట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దాదాపు 87 శాతం మంది పింఛను లబ్ధి దారులు చంద్రబాబుకు మార్కులు వేస్తున్నారు. తమకు ఖచ్చితంగా నగదు అందుతోందని చెబుతున్నారు.
దీనిపై తాజాగా ప్రభుత్వం సచివాలయాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. దీనిలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఎటూ స్పందించలేదని తెలిసింది. మిగిలిన 90 శాతం మంది లబ్ధిదారుల్లో 87 శాతం మంది ఆనందం వ్యక్తం చేశారు. అదేసమయంలో చంద్రబాబు స్వయంగా ఏదొ ఒక జిల్లాలో ప్రతి నెలా పాల్గొని పింఛను అందిస్తున్న తీరును కూడా మెచ్చుకున్నారు. ఇది ప్రజలకు – సీఎంకు మధ్య అనుబంధాన్ని పెంచుతుందని మెజారిటీ ప్రజలు పేర్కొన్నారు.
సో.. దీనిని బట్టి.. పింఛను విషయంలో ప్రభుత్వానికి మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు టీడీపీ నాయకులు. గత ఎన్నికలకు ముందు రూ.3000గా ఉన్న పింఛనును.. ఒకేసారి రూ.1000 పెంచి ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. అదేసమయంలో దివ్యాంగుల పింఛనును రూ.6 వేలకు పెంచి ఇస్తున్నారు. రెండు పరిణామాలు కూడా ప్రభుత్వానికి మంచి మార్కులు వేస్తున్నాయి.
గత ఏడాది పింఛన్ల పంపిణీ నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు ప్రజలతో మమేకమవుతున్నారు. నేరుగా ఆయనే అందిస్తున్నారు. దీంతో ఈ పరిణామం కూడా.. పార్టీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు కలిసి వస్తోందని అంటున్నారు. వాస్తవానికి ఏడాది పూర్తి కాబోతున్న ప్రభుత్వ పాలనలో మెజారిటీ సంఖ్యలో పింఛను దారులు బాబుకు మార్కులు వేయడం గమనార్హం.