రేవంత్ వర్సెస్ కేటీఆర్!… హీటెక్కిపోయింది!

తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరోమారు మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె నోటీసులపై సోమవారం స్పందించిన సీఎం రేవంత్… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఉద్యోగులు ఇలా సమ్మె నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. అంతేకాకుండా సంస్థ ద్వారా వస్తున్న ఆదాయం కాకుండా నయా పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ తీరుపై ఎదురు దాడికి దిగారు.

ఉద్యోగుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్టని ప్రభుత్వాలు అధికారంలో ఉండటం దారుణమని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని దేశంలోని అందరు సీఎంల కంటే కూడా అసమర్థ సీఎంగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగులకు వారి సంస్థల ద్వారా వచ్చే ఆదాయం మినహాయించి పైసా ఇవ్వలేనని రేవంత్ అంటున్నారంటే… ఉద్యోగుల త్యాగాల గురించి రేవంత్ కు ఇసుమంత కూడా తెలియదని కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్న కేటీఆర్… ఆ ఉద్యోగుల త్యాగాలను గుర్తెరిగిన కేసీఆర్ వారికి ఏకంగా 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. తమ ఉద్యోగాలనే పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సాగించిన ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.

హైదరాబాద్ లో త్వరలో జరగబోయే ప్రపంచ సుందరి పోటీలను ప్రస్తావించిన కేటీఆర్… అందాల పోటీల నిర్వహణ కోసం తెలంగాణ సర్కారు నుంచి రూ.200 కోట్ల నిధులను ఇచ్చేందుకు సిద్ధపడ్డ రేవంత్ రెడ్డికి… ఉద్యోగులకు మాత్రం నిధులు ఇవ్వడానికి చేతులు రావడం లేదని ఆరోపించారు. అయినా ఉద్యోగులు కోరుతున్నది గొంతెమ్మ కోర్కెలు కాదన్న కేటీఆర్… ఎన్నికల ముంగట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకే అడుగుతున్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఉద్యోగులను ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్… ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. సీఎం అంటే ఓ రాష్ట్రానికి తండ్రి లాంటి వారని చెప్పిన కేటీఆర్… తెలంగాణకు తండ్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి తన బిడ్డ లాంటి తెలంగాణకు శాపాడు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా తన స్వరాన్ని మరింతగా పెంచిన కేటీఆర్… రేవంత్ రెడ్డిపై మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి పోయినా ఓ దొంగను చూసినట్లుగా చూస్తున్నారని, బ్యాంకర్లు తనకు అపాయింట్ మెంట్లే ఇవ్వడం లేదని చెప్పిన రేవంత్ వ్యాఖ్యలను గుర్తు చేసిన కేటీఆర్… డబ్బుల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన దొంగను దొంగ అనక దొర అంటారా? అంటూ సెటైర్లు సంధించారు. కాంగ్రెస్ పార్టీని ఓ ఎర్రి పార్టీగా అభివర్ణించిన కేటీఆర్… ఆ ఎర్రి పార్టీ దొంగలాంటి రేవంత్ కు తాళాలు అప్పగించిందని మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను సీఎం చేయడం ద్వారా ఏఐసీసీతో పాటు రాహుల్ గాంధీ కూడా పెద్ద తప్పు చేశారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చర్యల ద్వారా… ఢిల్లీని నమ్మితే నట్టేట మునుగుతామన్న కేసీఆర్ మాటలు నిజమయ్యాయని కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.