బాబు మాట ఎవరూ వినట్లేదా

రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీ మంత్రుల‌కు.. చంద్ర‌బాబు అప్ప‌గించిన జిల్లాల్లో ప‌నితీరు ఎలా ఉంది? నాయ‌కులు క‌లిసి ముందుకు సాగుతున్నారా? ఇంచార్జ్ మంత్రులు ప‌ట్టించుకుంటున్నారా? అంటే.. లేద‌నేదే చంద్ర‌బాబు మాట‌. తాజాగా ఆయ‌న రెండు జిల్లాల‌కు చెందిన ఇంచార్జ్ మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల పరిస్థితి, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, నాయ‌కుల ప‌నితీరును ఆయ‌న స‌మీక్షించారు.

అయితే.. ఆశాజ‌న‌క‌మైన ప‌రిస్థితి అయితే.. చంద్ర‌బాబుకు క‌నిపించ‌లేదు. దీంతో ఇంచార్జ్ మంత్రుల ప‌ని తీరుపై త్వ‌ర‌లోనే వ‌ర్కు షాపు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. తాజాగా చంద్ర‌బాబు ఇంచార్జ్ మంత్రుల ప‌నితీరుపై నివేదిక అందింది.దీనిలో చాలా మంత్రులు త‌మ‌కు కేటాయించిన జిల్లాల్లో ఒక్క‌సారి కూడా ప‌ర్య‌టించ‌లేద‌ని తెలిసింది. ముఖ్యంగా క‌డ‌ప‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, కృష్ణాజిల్లాల్లో ఇంచార్జ్ మంత్రులు ఒక్క‌సారి కూడా ప‌ర్య‌టించ‌లేద‌ని స‌మాచారం.

దీనిపై మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో చంద్ర‌బాబు ఏక‌రువు పెట్టారు. కృష్ణా జిల్లాలో ప‌రిస్థితుల‌పై చంద్ర‌బాబు మ‌రింత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ ఇసుక‌, మ‌ద్యం, మ‌ట్టి విష‌యాల్లో చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌.. కృష్ణాజిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న ఇప్ప‌టికి ఒక్క‌సారి కూడా ప‌ర్య‌టించ‌లేదు. దీనిని ఎత్తి చూపుతూ.. మంత్రిగా అక్క‌డ ఎందుకు ప‌ర్య‌టించ‌లేద‌ని ఆయ‌నను నిల‌దీశారు.

ఇక‌, నుంచి కేటాయించిన జిల్లాల‌కు వాసంశెట్టి వెళ్లాల‌ని , రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించారు. అదేవిధంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న వంగ‌ల‌పూడి అనిత విష‌యంలోనూ చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. జిల్లాలో కేవ‌లం ఒకే ఒక్క‌సారి ప‌ర్య‌టించ‌డం.. కేవ‌లం అందుబాటులో ఉన్న నాయ‌కుల‌తోనే ఆమె భేటీ కావ‌డం వంటివి ఆమెకు మైన‌స్ అయ్యాయ‌ని.. అక్క‌డ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని ఆమెకు సూచించారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రుల ప‌నితీరుపై ఇక నుంచి నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.