ఏపీలో మద్యం కేసు వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. మాజీ సీఎం జగన్‌కు సన్నిహితులు, ఆయన దగ్గర పీఏలుగా పనిచేసిన వారిని విచారించేందుకు రెడీ అయింది. దీంతో పలువురు తమను ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న ఉద్దేశంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. వాస్తవానికి వారిని ఇంకా విచారణకు పిలవలేదు. కానీ, రాజ్ కసిరెడ్డి ఉదంతం నేపథ్యంలో వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు.
వీరిలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఉన్నారు. వీరికి సిట్ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వచ్చాయి. పైగా ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి.. పోలీసు విచారణను ఎదుర్కొన్న రాజ్ కసిరెడ్డి ఈ ముగ్గరి పేర్లను పోలీసులకు చెప్పారు. దీంతో అప్పటి నుంచే వీరికి ఒణుకు ప్రారంభమైంది. దీంతో తొలుత హైకోర్టును ఆశ్రయించారు. కానీ, వీరికి ఉపశమనం దక్కలేదు. దీంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సోమవారం జరిగిన విచారణలో ఈ ముగ్గురి విషయంపై సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు.. పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. ఎలానూ హైకోర్టులో పిటిషన్లు వేశారు కాబట్టి.. అక్కడే తేల్చుకోవాలని సూచించింది. అక్కడ ఏమైనా సానుకూల తీర్పు రాకపోతే.. అప్పుడు తాము విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
అయితే.. ఈ లోగా తమను అరెస్టు చేయకుండా చూడాలన్న ముగ్గురి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అరెస్టు చేస్తే.. తాము బాధ్యులము కాదని.. అలాగని ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏం చేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates