ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా చేశారు. అయితే.. ఇప్పుడు మరోసారి ప్రధాని రాకకు సంబంధించిన అధికారిక సమాచారం.. రాష్ట్రానికి చేరింది. ప్రధాన మంత్రి కార్యాలయ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేసమయంలో విశాఖపట్నం కలెక్టర్‌కు కూడా.. ఆదివారం సాయంత్రం లేఖ రాశారు. ‘ప్రధాని వస్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ప్రధాని వచ్చే నెల జూన్ 21న మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇది కూడా సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకే కావడం గమనార్హం.
ఇటీవల అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా.. సీఎం చంద్రబాబు.. ప్రధానిని యోగా దినోత్సవానికి పిలిచారు. ఆయ న అప్పుడు దాదాపు ఓకే చెప్పారు. అయితే.. యోగా కు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కేంద్రం దీనిని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని రాకపై సందేహాలు ఉన్నాయి. అయితే.. ఏమనుకున్నారో.. ఏమో ప్రధాని అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లిన రెండో రోజే.. ఏపీకి జూన్ 21, యోగా దినోత్సవానికి వస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేయడం గమనార్హం. అయితే.. ప్రధాని ఎంచుకున్న జిల్లా విశాఖపట్నం కావడం గమనార్హం.
వాస్తవానికి సీఎం చంద్రబాబు అమరావతిలో యోగా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అమరావతి పేరును మరింత ప్రచారం చేసుకునేందుకు.. అందరి దృష్టి పడేలా చేసేందుకు సీఎం చంద్రబాబు.. అమరావతిలోనే యోగా చేపడితే బెటర్ అని అనుకుంటున్నారు. కానీ.. తాజాగా ప్రధాని మాత్రం విశాఖను ఎంచుకున్నారు. దీంతో ఇటీవలే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయం.. ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రం పక్షాన అధికారికంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని.. ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రధాని మోడీ కూడా అక్కడకే వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా.. యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రధాని పర్యటన మరోసారి ఖరారు కావడం పట్ల కూటమి నాయకులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates